ప్రజాశక్తి-విజయనగరం : మెంటాడ మండలం చిన మేడపల్లి వద్ద ఈనెల 25న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు శంఖు స్థాపన చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించనున్న నేపథ్యంలో సుమారు 2వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు. బుధవారం బందోబస్తు సిబ్బందిని వివిధ కేటగిరిలుగా విభజించి, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పోలీసు ఉన్నతాధికారిని బాధ్యులుగా నియమించామని తెలిపారు. హెలి ప్యాడ్, పార్కింగు, కాన్వారు, సభా స్థలం, శిలా ఫలకం, రూట్ బందోబస్తు, ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ డైవర్షన్స్ విధులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. వాహనాల రాక, పోకలకు ఎటువంటి విఘాతం ఏర్పడకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ చేపట్టేందుకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనే ముఖ్య వ్యక్తుల వాహనాలకు, కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసే ప్రజల వాహనాలకు వేరువేరుగా పార్కింగు చేసుకొనే విధంగా పార్కింగు స్థలాలు ఏర్పాటు చేసామన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని భద్రతా చర్యలు చేపట్టామని, బందోబస్తు నిమిత్తం ముగ్గురు అదనపు ఎస్‌పిలు, 11 మంది డిఎస్‌పిలతో సహా సుమారు 2వేల మందిని వినియోస్తున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్, అల్లూరి సీతారామ రాజు జిల్లా అదనపు ఎస్‌పి అనిల్ పులిపాటి, జిల్లాకు చెందిన పలువురు డిఎస్‌పిలు,సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










