ప్రజాశక్తి-దత్తిరాజేరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈ నెల 25న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎ.నాగలక్ష్మి పరిశీలించారు. సోమవారం సాయంత్రం మెంటాడ మండలం కుంటినవలస, దత్తిరాజేరు మండలం మరడాం గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. మరడాం వద్ద ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభాస్థలిని సందర్శించారు. అధికారులతో మాట్లాడి చేస్తున్న ఏర్పాట్లను తెలుసుకున్నారు. వర్షాకాలం కావడంతో, వర్షం పడినా సభకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, పటిష్టమైన సభా వేదికను, షామియానాను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిరాటంకంగా సభ జరగాలని, ఎటువంటి అంతరాయం కలగకూడదని స్పష్టం చేశారు. కూర్చోడానికి సరిపడా కుర్చీలను, లైటింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాలను పరిశీలించారు. విఐపిల వాహనాలకు వేరుగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలని, సామాన్యులు తరలివచ్చే వాహనాలకు సభాస్థలి సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడ కూడా విఐపిలు వేచి ఉండటానికి, వాహనాల పార్కింగ్‌కు తగిన ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖను, డిసిహెచ్‌ఎస్‌ను ఆదేశించారు.
కుంటినవలసలో గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమం, శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆర్‌అండ్‌బి ఆధ్వర్యంలో చేపడుతున్న నేలను చదును చేసే పనులపై ఆరాతీశారు. వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు. ఇక్కడినుంచి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్న సుమారు 4 కిలోమీటర్ల రహదారి పనులను తనిఖీ చేశారు. పర్యటనలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.










