ప్రజాశక్తి- డెంకాడ: వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీనికి ఒక సచివాలయానికి 10 నుంచి 15 మంది వరకు సిబ్బందిని కేటాయించారు. భవనాల కోసం సుమారు కోటి రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపట్టారు. అయితే ప్రభుత్వ నమ్మకాన్ని ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని అధికారులు మాత్రం పెడచెవిన పెట్టి ఇవేవీ తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
మండలంలోని మోదవలస సచివాలయంలో సుమారుగా 10 మంది సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం నియమిచింది. ఈ సచివాలయ పరిధిలో చిన్నవల్లూరు, పెద్దవల్లూరు, కొండయ్యపాలెం, గండిబోయిన కల్లాలు ఇలా పలు గ్రామాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు గ్రామాలు కూడా ఈ సచివాలయ పరిధిలోనే ఉన్నాయి. వీరికి సకాలంలో సేవలందించాలని ప్రభుత్వం వీరిని నియమించింది. అయితే ఈ సచివాలయంలో పనిచేసిన సిబ్బంది మొత్తం ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో వెళ్లిపోయారు. ఇక్కడ ప్రస్తుతం గ్రామ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్లు మాత్రమే ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. బదిలీ అయి వెళ్లిపోయిన స్థానంలో ఇక్కడకు ఎవరూ రాలేదు. దీంతో సచివాలయానికి వివిధ పనులు పై వస్తున్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు రెండు నెలల నుంచి ఈ ఇబ్బందులు పడుతున్నామని సచివాలయ పరిధిలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఎంపిడిఒ డిడి స్వరూపారాణి దృష్టికి తీసుకురాగా ఆమె మోదవలస సచివాలయానికి బదిలీపై వచ్చే సిబ్బందికి ఫోన్ చేసి వచ్చి జాయిన్ అవ్వాలని కోరినటప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదని తెలిస్తోంది. ఇప్పటికైనా తమ సచివాలయానికి పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలు అందించేటట్టు చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.










