ప్రజాశక్తి-రేగిడి : వైసిపి ప్రభుత్వ హయాంలో సామాన్యుల బతుకులు దుర్భరంగా మారాయని మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఉణుకూరు గ్రామంలో బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్థవంతమైన పాలన, సంక్షేమం, అభివృద్ధి చేసిన ఘనత టిడిపిదేనన్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి సైకోపాలనతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ధ్వంసం చేస్తోందని ధ్వజమెత్తారు. విద్యుత్తు ఛార్జీలు, ఇంటి పన్నులు పెంచి, చెత్త ఛార్జీలు వేసి సామాన్యుల బతుకులను దుర్భరం చేశారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలను అనేక రకాలుగా మోసం చేస్తూ వారిపై పెనుభారం మోపుతున్నారని మండిపడ్డారు. ఇసుక, మైనింగ్, లిక్కర్, రేషన్ బియ్యం మాఫియా.. ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని దుయ్యబట్టారు. గ్రామాభివృద్ధి కోసం రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను వైసిపి ప్రభుత్వం దారి మళ్లించడంతో పల్లెలు అభివృద్ధికి నోచుకోక కుంటుపడ్డాయన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కిమిడి అశోక్ కుమార్, డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ దూబ ధర్మారావు. నాయకులు గురువాన నారాయణరావు, గేదెల బాలమురళీధర్, తదితరులు పాల్గొన్నారు.
బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ
బాడంగి : ప్రజల భవిష్యత్తుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇస్తున్నారని ఆ పార్టీ ఎస్‌టి సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలవలస గౌరు తెలిపారు. మండలంలోని లకీëపురం పంచాయతీ ఎరుకులపాకలు గ్రామంలో ఆయన ఆధ్వర్యాన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపగడపకు వెళ్లి గత టిడిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. వాటిని వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. నిధులను దుర్వినియోగం చేస్తోందన్నారు. ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఎస్‌సి, ఎస్‌టిలకు అందడం లేదన్నారు. కార్యక్రమంలో లక్ష్మీపురం సర్పంచ్ పాలవలస పార్వతి, తదితరులు పాల్గొన్నారు.










