ప్రజాశక్తి-శృంగవరపుకోట, వేపాడ : సామాజిక న్యాయానికి ప్రధాని మోడీ తూట్లు పొడుస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. ముస్లిములపై, క్రిస్టియన్లపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ మూకలు అతికిరాతకంగా హింసకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన సమరభేరిని బుధవారం వేపాడ మండలంలోని బొద్దాం, శృంగవరపుకోట మండలంలోని వెంకటరమణపేటలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ మణిపూర్, హర్యానాలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ మూకలు అది కిరాతకంగా దాడులు చేయడం, చంపడం దేశానికే అభద్రతని తెలిపారు. లౌకికరాజ్యంలో మత సమస్యకు తావు లేకుండా చూడాల్సిన ప్రధాని మోడీ.. వాటికి మరింత ఆజ్యం పోసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ఎన్నికల్లో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. అధిక ధరలను నియంత్రించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వీటన్నింటినీ పక్కదోవ పట్టించి, ఎన్నికల్లో లబ్ధి కోసం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బొద్దాంలో నివశిస్తున్న ముస్లిములకు కనీస సౌకర్యాలు లేవని, 50 ఏళ్లుగా పూరిగుడిసెల్లోనే నివాసం ఉంటున్నారని తెలిపారు. వారికి పట్టాల కోసం పోరాటం చేస్తే పట్టాలిచ్చి, స్థలాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. వెంటనే స్థలాలివ్వాలని అధికారులను డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు చల్లా జగన్, మద్దిల రమణ, చలుమూరి శ్యామ్, వై.భాస్కరరావు, బి.శంకరరావు, ఎస్.రామసత్యం, షేక్ అబ్దుల్లా, షేక్ బుడ, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంటౌన్ : సిపిఎం చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా బుధవారం కోట జంక్షన్ వద్ధ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 30, 31న సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ, సిఐటియు నాయకులు, శ్రీను, రాజు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ నగర్, తోటపాలెంలో, పూల్‌బాగ్‌లో సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.జగన్‌మోహన్, ఐద్వా నాయకులు వి.లక్ష్మి, వి.రామచంద్రరావు పాల్గొన్నారు.










