ప్రజాశక్తి - వంగర : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ అధ్యక్షతన సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశం సాదా సీదాగా సాగింది. వ్యవసాయ శాఖ సమీక్షలో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఇప్పటివరకు ఇకెవైసి పూర్తి కాకపోతే రైతులు తమ పంటలను అమ్ముకునే సమయంలో తీవ్రంగా నష్టపోతారని వ్యవసాయ శాఖ అధికారి కన్నబాబుపై ఎంపిపి, ఎంపిటిసి కరణం సుదర్శనరావు మండిపడ్డారు. అగ్రికల్చర్ అసిస్టెంట్లతో త్వరితగతిన పూర్తిగా ఆ పనిని పూర్తి చేయాలని అన్నారు. విద్యుత్ శాఖ సమీక్షలో ఎం సీతారాంపురం పీడరు 65 కిలోమీటర్ల దూరం ఉన్నందున వివిఆర్ పేట, రాజుల గుమ్మడ గ్రామాలకు పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా చేయలేకపోతున్నామని ఎఇ వినరు కుమార్ సర్వసభ్య సమావేశంలో సభ్యులకు క్షమాపణ కోరారు. వివిఆర్ పేటలో విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. సాగునీటి కాలువలు సక్రమంగా లేనందున తోటపల్లి కుడుకాలువ శివారు గ్రామాలకు సాగునీరు అందటం లేదని కనీసం జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలోనైనా పనులు చేపట్టి సాగునీరు అందించాలని వైస్ ఎంపిపి కిమిడి ఉమామహేశ్వరరావు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్లు, నూతన భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఎఇ ఆనందరావు వెల్లడించగా సకాలంలో బిల్లులు చెల్లిస్తే పనులు చేపడతామని పలువురు సర్పంచులు స్పష్టం చేశారు. ఉద్యా నవన పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని రైతులు ముందుకు రావాలని రాజాం ఉద్యానవన శాఖ అధికారి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ వావిలిపల్లి శ్రీనివాస రావు, డిటి బూరాడ సుందర రావు, వివిధ శాఖల అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.










