ప్రజాశక్తి - నెల్లిమర్ల : ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన తుపాకుల రవణమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాయకులు ఏ. జగన్మోహన్‌రావు, నాయకులు బాబురావు అధికారులను, నగర పంచాయతీ పాలకవర్గాన్ని గురువారం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల్లో మరణించిన కార్మికుల బిడ్డలకి ఉపాధి కల్పిస్తున్నారని, ఇక్కడ ఎందుకు తుపాకుల రవణమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వటం లేదని ప్రశ్నించారు. పర్మినెంట్, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సిపిఎస్ రద్దు, సరెండర్ లీవ్ డబ్బులు చెల్లింపు, ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్ వేతనాలు, రిస్క్ అలవెన్స్ అమలు తదితర డిమాండ్లు పరిష్కరించాలని ఆగస్టు 24న చలో విజయవాడకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా గురువారం నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కిల్లంపల్లి రామారావు, నాయకులు లక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.










