ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యా శాఖలో రోజుకొక విధానం అమలు వల్ల ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మొన్నటి వరకు 98 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లను హైస్కూల్‌కి సర్దుబాటు ప్రక్రియ ద్వారా పంపించారు. దీనివల్ల స్కూల్ అసిస్టెంట్లు లేకపోవడం వల్ల విద్యార్థులకు సరైన విద్య అందే అవకాశం లేదని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేటు స్కూళ్లలో చేర్పించారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చేరిన విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరోవైపు మరలా నేడు పని సర్దుబాటు పేరుతో స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమికోన్నత పాఠశాలలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రోజుకొక నిర్ణయంతో విద్యార్థులకు అన్యాయం జరగడంతోపాటు విద్యా సంవత్సరం మధ్యలో ఈ విధమైన మార్పులు చేయడం వల్ల ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. విద్యా విధానంలో ఇటువంటి నిర్ణయాలు విద్యా వ్యవస్థకు తీవ్రమైన నష్టం కలిగించడం, ప్రయివేటు విద్యను ప్రోత్సహించడం తప్ప మరొకటి కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సెక్షన్ ఆధారంగా పోస్టుల కేటాయింపు
విద్యాశాఖలో గతంలో సెక్షన్‌కి 40 మంది విద్యార్థులు ఉండేవారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపులు చేపట్టారు. నేడు అందుకు భిన్నంగా సెక్షన్ల బట్టి ఉపాధ్యాయుల కేటాయింపు చేయడం విద్యా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా ఉంది. నేడు 60 మంది విద్యార్థులను ఒక సెక్షన్‌గా చేయడం వల్ల ఉపాధ్యాయ పోస్టులు కుదించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందనేది ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. దీనివల్ల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి ఆస్కారం లేకుండా పోతుంది. 6, 7, 8 తరగతులకు సెక్షన్‌కి 53 మంది విద్యార్థులుంటే ఒకే సబ్జెక్ట్ టీచర్‌ని ఇవ్వడం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడం తప్ప మరొకటి కాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఉపాధ్యాయ పోస్టులకు, విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా ఉంది.
నేడు డిఇఒ కార్యాలయం ఎదుట ధర్నా
పని సర్దుబాటు నిలిపేయాలని, జిఒ 117ను రద్దు చేయా లని, బదిలీలు, ఉద్యోగోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని కోరుతూ శనివారం సాయంత్రం డిఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్లు ఫ్యాప్టో నాయకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం డిఇఒను కలిసి, నోటీసు అందజేశారు. అనంతరం సెల్ఫ్ టెస్ట్ షెడ్యూల్ సవరించాలని, సిలబస్ పూర్తికావడానికి కావలసిన సమయం ఆధారంగా టెస్టుల షెడ్యూల్ ఉండాలని, టెస్ట్‌కు సంబంధించిన పేపర్లు అందరికీ అందుబాటులో స్కూల్ కాంప్లెక్స్‌లకు పంపించాలని విన్నవించారు.










