Sep 10,2023 21:14

విజయనగరంలో సామూహిక నిరాహార దీక్ష చేస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-విజయనగరంకోట : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లాలో రెండో రోజు ఆదివారమూ నిరసనలు కొనసాగాయి. టిడిపి నాయకులు సామూహిక దీక్షలు చేపట్టారు. ఎక్కడికక్కడ టిడిపి ముఖ్య నాయకులు బయటకు రాకుండా ఉదయం నుంచే పోలీసులు గృహ నిర్బంధాలు విధించారు. సామూహిక దీక్షలను భగం చేశారు. పోలీసులు, ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పలు చోట్ల నల్లకండువాలతో నిరసనలు చేపట్టారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు మండిపడ్డారు. విజయనగరంలోని అశోక్‌ బంగ్లాలో నల్ల కండువాలు వేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన నడవడం లేదన్నారు. మూర్ఖత్వానికి తలా, తోకా ఉండవన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేయకూడదని ఏ నిబంధనలూ చెప్పలేదన్నారు. భయపడితే లాభం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు. చంద్రబాబుకు అండగా ఉంటామని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయనగరంలోని దర్గాలో, ఆర్‌సిఎం చర్చిలో, గురునానక్‌ బాబా మందిరంలో టిడిపి నాయకులు ప్రార్థనలు చేశారు. నగరంలో టిడిపి నగర మాజీ అధ్యక్షులు కర్రోతు వెంకట నర్సింగరావును హౌస్‌ అరెస్టు చేశారు. కార్యక్రమాల్లో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, టిడిపి పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, కార్యదర్శి బంగారు బాబు, మండల అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కోండ్రు మురళి, రొంగల రామారావు, విజ్జపు ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల మండల కేంద్రంలో టిడిపి ఆధ్వర్యాన సామూహిక నిరాహార దీక్ష చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి సీనియర్‌ నాయకులు కంది చంద్రశేఖర్‌రావు, సువ్వాడ రవి శేఖర్‌.. ఎన్‌టిఆర్‌, అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి శాంతి యుతంగా నిరసన చేశారు. వీరిని వెంటనే నెల్లిమర్ల పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, పట్టణ అధ్యక్షులు బైరెడ్డి లీలావతి, నాయకులు లెంక అప్పలనాయుడు, పోతల రాజప్పన్న, నల్లం శ్రీనివాసరావు, రెడ్డి వేణు, చిల్ల పద్మ, కోట్ల సునీత, గురాన చక్రధర్‌, అట్టాడ శ్రీధర్‌ పాల్గొన్నారు. బొబ్బిలి పట్టణంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన ఆధ్వర్యాన ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేపట్టేందుకు టిడిపి నేతలు టెంటు వేయగా పట్టణ సిఐ ఎం.నాగేశ్వరరావు, పోలీసులు అడ్డుకున్నారు. కోటలో దీక్ష చేయాలని పోలీసులు సూచించడంతో ప్రభుత్వం తీరుపై బేబినాయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కోటలో దీక్షలు నిర్వహించారు. వేపాడ మండలంలోని డిఆర్‌పేటలో టిడిపి మహిళలు నిరసన తెలిపారు. చీపురుపల్లి పట్టణంలో టిడిపి నాయకులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలను పోలీసులు భగం చేశారు. ఆదివారం ఉదయం నుంచి పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జునను స్వగృహంలో హౌస్‌ అరెస్టు చేశారు. ఆయన సూచనలతో స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో టిడిపి నాయకులు నిరాహార దీక్షకు దిగారు. కొద్దిసేపటికే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని దీక్షను భగం చేశారు. నాయకులను అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీక్షలో కూర్చున్న టిడిపి నాయకులపై బైండవర్‌ కేసులు పెట్టారు. శృంగవరపుకోట పట్టణంలోని ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలకు కూర్చున్న లలితకుమారి గ్రూపును, పట్టణంలోని దేవి కూడలిలో అంబేద్కర్‌ విగ్రహం పక్కన నిరాహార దీక్షలకు కూర్చున్న గొంప కృష్ణ గ్రూపును దీక్షలను పోలీసులు భగం చేశారు. ఈ సందర్భంగా టిడిపి వేపాడ మండల అధ్యక్షులు గొంప వెంకటరావును అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామునే పట్టణంలోని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణను తన నివాసంలోనూ, ఎల్‌కోటలోని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని తన నివాసంలోనూ హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పూసపాటిరేగ మండలంలో టిడిపి సామూహిక నిరాహార దీక్షలకు పిలుపునివ్వడంతో పూసపాటిరేగ పోలీసులు ఆదివారం ఉదయం నుంచి అప్రమత్తమయ్యారు. టిడిపి మండల అధ్యక్షులు మహంతి శంకరరావుతో పాటు నాయకులు పసుపులేటి గోపి, పిన్నింటి శ్రీనువాసరావు, ఇజ్జురోతు ఈశ్వర్రావు, పిళ్లా లక్ష్మినారాయణ, బొంతు రవి, పులపా వెంకటప్పారావు, పిళ్లా శ్రీరాములు, కొరటాన ప్రసాద్‌రావు, పిన్నింటి సీతం నాయుడు, చందక ఆనందరావు, రాకేష్‌ శర్మను అదుపులోకి తీసుకున్నారు.
నేడు జిల్లా బంద్‌
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ సోమవారం జిల్లా బంద్‌కు ఆ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున పిలుపునిచ్చారు. బంద్‌లో పార్టీ శ్రేణులు పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.