ప్రజాశక్తి-విజయనగరం : ప్రకృతి వ్యవసాయ విస్తరణకు రైతులను శాస్త్రవేత్తలుగా రూపొందించేందుకు ప్రణాళిక తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ సంఘ నిర్వాహక ప్రకృతి వ్యవసాయం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎం.ఎస్.స్వామినాథన్ పురస్కార గ్రహీత టి.విజరు కుమార్ కోరారు. జిల్లా అంతటా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని ఆయన సూచించారు. జిల్లాలో శుక్రవారం పర్యటించిన విజయకుమార్, ముందుగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తో భేటీ అయ్యారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రకతి వ్యవసాయం, దాని విస్తరణ అవకాశాలపై చర్చించారు.
అనంతరం కలెక్టర్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులు, మోడల్ మేకర్స్, మెంటార్స్, రైతు శాస్త్రవేత్తలతో సమావేశం అయ్యారు. జిల్లాలో జరుగుతున్న ప్రకతి వ్యవసాయంపై మండలాల వారీగా సమీక్షించి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ, ప్రకతి వ్యవసాయంలో రాష్ట్రానికి మూడు జాతీయ అవార్డులు లభించడం పట్ల అధికారులను, సిబ్బందిని అభినందించారు. జిల్లాలో శతశాతం ప్రకృతి వ్యవసాయం చేసేదిశగా కృషి చేయాలని కోరారు. దీనికోసం రైతు శాస్త్రవేత్తలను రూపొందించేందుకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విద్యావంతులైన రైతులను ఎంపిక చేసి పులివెందులలో నాలుగేళ్ల పాటు శిక్షణ ఇప్పించి రైతు శాస్త్రవేత్తగా తయారు చేస్తామని తెలిపారు. వీరి సేవలను ప్రతి ఆర్‌బికెలో వినియోగించుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రైతులను గుర్తించి శిక్షణకు పంపించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏడాదికి ఆరోగ్యకరమైన మూడు పంటలను పండించవచ్చునని, అధిక దిగుబడులను సాధించవచ్చునని అన్నారు. దీనివలన నేల స్వభావం అనుకూలంగా మారుతుందని చెప్పారు. వైవిధ్యమైన పంటలను వేయడం ద్వారా కలుపు నివారణ కూడా సాధ్యపడుతుందని సూచించారు.
జిల్లాలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికను మార్చవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గతంలో జూన్ నెలలోనే వర్షాలు పడేవని, కానీ ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా అక్టోబర్ నవంబర్ నెలల్లో మాత్రమే తుపాన్లు వల్ల విస్తతంగా వర్షాలు పడుతున్నాయని చెప్పారు. వర్షాలకు అనుగుణంగా పంటల ప్రణాళికను మార్పు చేయాలని సూచించారు. జూన్‌లో ఆరుతడి పంటలు వేయాలన్నారు. ప్రకృతి సేద్యాన్ని కేవలం వ్యవసాయానికే పరిమితం చేయకుండా, మత్స్య సాగు లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రోత్సహించాలని సూచించారు.
బొండపల్లి మండలం దేవుపల్లి, బొబ్బిలి మండలం మెట్టవలసలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించారు. కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయాధికారి వి.టి.రామారావు, ఎపిసిఎన్‌ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎం.ఆనందరావు, సహాయ సంచాలకులు ప్రకాష్, అన్నపూర్ణతో పాటు హేమ సుందర్ తదితర వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










