Sep 01,2023 20:44

కౌలు రైతులకు రైతు భరోసా సాయం చెక్కును అందిస్తున్న కలెక్టర్‌, జెడ్‌పి చైర్మన్‌

ప్రజాశక్తి-విజయనగరం :  రైతు ఆనందంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని దానిలో భాగంగానే రైతు భరోసా, పంట నష్ట పరిహారం, పెట్టుబడి రాయితీ సకాలంలో చెల్లిస్తూ రైతులకు అండగా నిలుస్తోందని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భూమి లేని పేదలకు కూడా ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో సిసిఆర్‌సి కార్డులున్న కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని గుర్తు చేశారు. సాధారణ కౌలు రైతులు, దేవాదాయ భూముల్లో సాగు చేసుకుంటున్న కౌలు రైతులకు రైతు భరోసా ఆర్థిక సాయం, మే, జూన్‌ నెలల్లో కురిసిన వర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు పరిహారం చెల్లించే నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వరుసగా ఐదో ఏట తొలి విడత నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా మీట నొక్కి జమ చేశారు. కార్యక్రమంలో జిల్లా నుంచి జెడ్‌పి ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి.ఎస్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె. మయూర్‌ అశోక్‌, డిసిసిబి ఛైర్మన్‌ చినరాము నాయుడు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కార్యక్రమం అనంతరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. వరుసగా ఐదో ఏట తొలి విడతలో భాగంగా జిల్లా నుంచి 2,603 మంది కౌలు రైతులకు రూ.1.95 కోట్ల ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని వివరించారు. వారిలో దేవాదాయ భూముల్లో సాగు చేసుకుంటున్న కౌలు రైతులు ఐదుగురు ఉన్నారని వారికి కూడా ఆర్థిక సాయం అందిందని స్పష్టం చేశారు. వీరితో పాటు ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో కురిసిన వర్షాలకు 39.54 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని 182 మంది బాధిత రైతులకు రూ.9.88 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు. అనంతరం కౌలు రైతులకు, పంట నష్టం వాటిల్లిన రైతులకు సంబంధిత మెగా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు, ఉద్యాన శాఖ డిడి జమదగ్ని, పశు సంవర్ధక శాఖ జెడి మల్లేశ్వరరావు, సెంట్రల్‌ బ్యాంకు డిఎం జగన్నాథం, వ్యవసాయ శాఖ ఎడి తదితరులు పాల్గొన్నారు.