Aug 28,2023 21:56

సిఐటియు నాయకులు వి.ఇందిరను అరెస్టు చేస్తున్న పోలీసులు

 

  సిఐటియు నాయకులు వి.ఇందిరను అరెస్టు చేస్తున్న పోలీసులు
  సిఐటియు నాయకులు వి.ఇందిరను అరెస్టు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-కొమరాడ  : దశాబ్ద కాలంగా గిరిజనులు ఎదురుచూస్తున్న పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తయ్యేవరకూ దశలవారీగా పోరాటం చేస్తామని వంతెన సాధన కమిటీ సభ్యులు తేల్చిచెప్పారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని కోవట్లపేట నుంచి కొమరాడ తహశీల్దార్‌ కార్యాలయం వరకు వంతెన సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీర్యాలీ చేపట్టారు. 11 రోజులుగా కోమట్లపేట వద్ద రిలే దీక్షలు చేపట్టారు. అనంతరం వంతెన సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేందుకు పాదయాత్రగా వచ్చి ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. ఈ నిరసనకు టిడిపి, సిపిఎం, జనసేనతోపాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. అనంతరం వక్తలు మాట్లాడుతూ పూర్ణపాడు-లాబేసు వంతెన ఎన్నికల హామీగానే ఉండిపోతోంది తప్ప పూర్తి చేసేందుకు ఏ ప్రభుత్వమూ చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. కోట్ల రూపాయలు బహిరంగ సభలకు ఖర్చు పెడుతున్న వైసిపి ప్రభుత్వం.. కేవలం రూ.7 కోట్లు వంతెన కోసం కేటాయించలేదా? అని ప్రశ్నించారు. వంతెన పూర్తి కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నిరసన చేస్తున్న 10 మంది నాయకులను, సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, వంతెన సాధన కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, పి.అప్పలస్వామి, టిడిపి మండల అధ్యక్షులు ఉదరుశేఖర్‌ పాత్రుడు, ప్రజా సంఘాల నాయకులు బుడితి అప్పలనాయుడు, సంగం, కోరాడ ఈశ్వరరావు, వి.ఇందిర, కోలక అవినాష్‌ ఉన్నారు. నిరసనకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి, జనసేన మండల అధ్యక్షులు శ్రీకర్‌ మద్దతు తెలిపారు.