ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలంలోని వట్టిగడ్డ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆగూరి సుబ్బలక్ష్మి,రమణ దంపతులు, గ్రామస్తులు గ్రామ యువత, మహిళలు ఆధ్వర్యంలో కులమతాలకతీతంగా గ్రామ దేవత పట్టాలమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలంలోని తంటికొండ పంచాయితీ వట్టిగడ్డ గ్రామంలో 3 రోజులపాటు ఘనంగా పట్టాలమ్మ తల్లి జాతర మహోత్సవం నిర్వహించారు. గ్రామస్తుల ఆరాధ్య దైవం, ఇలవేల్పు అయిన పట్టాల మ్మ తల్లిని గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతో పూజించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ శివారున ఉన్న పట్టాలమ్మ తల్లి గుడివద్ద మంగళవారం రాత్రి కాంతార, ఆఘోర, వేషాలతో, కోలాటం, గరగలు నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.శక్తి వేషాలు,దింసా నృత్యం, హైదరాబాద్ వారిచే డి,జే కార్యక్రమాలు గ్రామస్తులను అలరించాయి. గ్రామ సర్పంచ్ ఆగురి సుబ్బలక్ష్మి, ఉప సర్పంచ్ పల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో యువకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.










