Aug 20,2023 20:43

మూతపడిన స్టోన్‌క్రషర్‌

ప్రజాశక్తి - జామి : రాష్ట్ర ప్రభుత్వం రాయల్టీ వసూళ్లను ప్రయివేటుకు అప్పగించడంతో మైనింగ్‌ పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. జిల్లాలో 90 శాతం స్టోన్‌క్రషర్లు మూతపడగా, క్వారీల్లో పనులు నిలిచిపోయి, వేలాది మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నిర్మాణరంగం కుప్పకూలి కార్మికులు రోడ్డున పడ్డారు. తీవ్ర సంక్షోభం నెలకొన్నా పాలక వర్గాలు, ప్రతిపక్షాలు మాట్లాడని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే వేలాది కుటుంబాలు పనుల కోసం వలస పోయే ప్రమాదం ఉందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లాలో 250కుపైగా రోడ్డు మెటల్‌ క్వారీలున్నాయి. వీటిపై సుమారు 200 స్టోన్‌ క్రషర్లు ఆధారపడి పనిచేస్తున్నాయి. మొత్తం క్వారీలు, క్రషర్లలో 5 వేలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. గత నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం రాయల్టీని ప్రయివేటుకు అప్పగించింది. రాఘవ ప్రయివేటు సంస్థకు జిల్లాలో సుమారు రూ.9 కోట్లకు కట్టబెట్టారు. దీంతో ప్రతి క్వారీ, క్రషర్‌ వద్ద చెక్‌ పోస్టులు పెట్టి, రాయల్టీ చెక్‌ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అత్యధిక క్వారీలకు లీజు గడువున్నా, రెన్యువల్‌ కాకపోవడంతో రాయల్టీ బిల్లులు చూపించే పరిస్థితి లేదు. దీంతో అనివార్యంగా క్వారీలు, క్రషర్లు మూతబడ్డాయి.
రోడ్డున పడ్డ కార్మికులు
క్వారీలు నిలిచిపోవడంతో క్వారీ కార్మికులు పనులకు దూరమై, రోడ్డున పడ్డారు. క్వారీ యజమానులు మైన్స్‌ అధికారుల చుట్టూ ఫైల్స్‌ పట్టుకుని తిరుగుతున్నా, ప్రభుత్వ నిబంధనల పుణ్యమా? అని క్వారీలు రెన్యువల్‌ పొందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే అనివార్యంగా క్వారీలు మూతబడుతున్నట్లు తెలుస్తోంది. అనుమతులున్న క్వారీల్లో కూడా పనులు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రతి స్టోన్‌ క్రషర్‌ లో 20 నుంచి 30 మంది వరకు కార్మికులు పనిచేసేవారు. జిల్లాలో 90 శాతం మూతబడి, మొత్తం కార్మికుల ఉపాధి గల్లంతైంది.
సామాన్యులపై భారం
క్వారీలో మెటీరియల్‌ తరలించడంలో భాగంగా రాయల్టీ వసూలు బాధ్యత ప్రభుత్వం నిర్వహించేది. కానీ ప్రభుత్వం ఈ బాధ్యతను ప్రయివేటుకు అప్పగించడంతో యూనిట్‌కి రూ.800 రాయల్టీ బిల్లు కట్టాలి. ఈ బిల్లులు అనుమతులు ఉన్న క్వారీలకు ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. కానీ ఇసి (పర్యావరణ అనుమతులు) లేక అత్యధిక క్వారీలు అనుమతులు లేవు. దీంతో రాయల్టీ బిల్లులు చూపించే పరిస్థితి లేదు. ఉన్న కొద్దిపాటి క్వారీల్లో రాయల్టీ బిల్లులు ఉన్నా, గతం కన్నా.. ధరలు అమాంతంగా పెంచేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే యూనిట్‌ 20 ఎంఎం పిక్క ధర గతంలో రూ.3300 ఉంటే ప్రస్తుతం రూ.5 వేలపైనే పలుకుతోంది. మైనింగ్‌ మెటీరియల్‌ ధరలు రెట్టింపు కావడంతో సామాన్యుల ఇళ్ల నిర్మాణం తీవ్ర భారమైంది. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఫలితంగా నిర్మాణ రంగంలో కార్మికులు పనులకు దూరమై, నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే, రానున్న రోజుల్లో మైనింగ్‌ రంగం దెబ్బతిని పోవడం ఖాయమని పలువురు హెచ్చరిస్తున్నారు.