Aug 27,2023 21:02

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, సెట్విజ్‌ సిఇఒ బి.రామ్‌గోపాల్‌

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన 'ఆడుదాం ఆంధ్రా' క్రీడా కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, సెట్విజ్‌ సిఇఒ బి.రామ్‌గోపాల్‌ తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ వారం తనను కలిసిన 'ప్రజాశక్తి'కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు గురించి వివరించారు. మరిన్ని వివరాలు...
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది?.
అక్టోబర్‌ రెండో తేది నుంచి 30వ తేది వరకు సచివాలయాల పరిధిలో, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో పోటీలు జరగనున్నాయి. ఆడుదాం ఆంధ్రా క్రీడల ద్వారా గ్రామీణ స్థాయి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఎన్ని క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి?.
ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రధానంగా ఐదు క్రీడాంశాల్లో జరగనున్నాయ. వాటిలో వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, క్రికెట్‌, షటిల్‌ బ్యాడ్మింటిన్‌ ఉన్నాయి. జిల్లా స్థాయిలో నాలుగు దశల్లో జరిగే పోటీల్లో సుమారు లక్షకు పైగా క్రీడాకారులను పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.
పోటీల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందా?. వాటిని ఎలా కేటాయించనున్నారు?.
పోటీలకు ముందుగా జిల్లాకు లక్షన్నర నిధులు విడుదలయ్యాయి. వీటితో ముందుగా సచివాలయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు ఖర్చు చేస్తాం. ఇప్పటికే జిల్లాలో ఐదు క్రీడాంశాలపై షార్ట్‌ ఫిల్మ్‌లు సిద్ధం చేశాం. అన్ని సచివాలయాల్లో వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించి అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశాం.
ఆడుదాం ఆంధ్రా పోటీల్లో ఏ వయస్సు వారు పాల్గొనవచ్చు? విజేతలకు బహుమతులు ఇవ్వనున్నారా?.
ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో 15 ఏళ్లు దాటిన వారు అర్హులు. సచివాలయ పరిధిలో ఆడే క్రీడాకారులకు క్రీడా కిట్లు ఇవ్వనున్నాం. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పోటీలకు బహుమతులు ప్రదానం చేయనున్నాం. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.35 వేలు, ద్వితీయ, తృతీయ స్థానాలకు రూ.15 వేలు, రూ.10 వేలు నగదు బహుమతులు ఇవ్వనున్నాం. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లను విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నాం.
ఇండోర్‌ స్టేడియాలు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు తీసుకుంటున్న చర్యలేమిటి?.
జిల్లా కేంద్రంలో నెహ్రూ పార్కు ఎదురుగా ఉన్న ఇండోర్‌ స్టేడియానికి మరమ్మతులు జరుగుతున్నాయ. సివిల్‌ వర్క్స్‌ వారం రోజుల్లో పూర్తి చేసి, దాన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నాం. విజ్జీ స్టేడియంలో ఉన్న ఇండోర్‌ స్టేడియం కాంట్రాక్టర్‌కు రెండు కోట్లకు పైగా డబ్బులు చెల్లించాల్సి ఉంది. త్వరలో ఆ డబ్బులు చెల్లించి దాన్ని స్వాధీనం చేసుకొంటాం.
ఇండోర్‌ స్టేడియంలో జిమ్‌ వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు ఏమైనా చేపట్టారా?.
ఇండోర్‌ స్టేడియంలో ఉన్న జిమ్‌ను మరో పది రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎసిలు పెట్టి, ట్రేడ్‌మిల్‌ కొత్తది కొనుగోలు చేశాం. ఉన్న పరికరాలు వినియోగంలోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాం. రెండున్నర లక్షలు ఖర్చు పెట్టాం. రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో ఉన్న ఓపెన్‌ జిమ్‌లో పాడైన వాటిని స్థానికులు కొంతమంది స్వచ్ఛందంగా బాగుచేశారు. జిమ్‌కు రూ.300 రుసుం పెట్టాలని ఆలోచిస్తున్నాం.
క్రీడా వికాస కేంద్రాలు అమలు ఎంత వరకు వచ్చింది?.
నియోజకవర్గానికి ఒక క్రీడా వికాస కేంద్రం ఏర్పాటు చేసే విధంగా గుర్తించి చర్యలు చేపట్టాం. జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గంలో గరివిడిలో ఏర్పాటు చేసిన క్రీడా వికాస కేంద్రం త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం చేశాం. మిగిలిన నియోజకవర్గాల్లో క్రీడా వికాస కేంద్రాల పనులు 50 శాతం నుంచి 60 శాతం వరకు జరిగి నిలిచిపోయాయ.
జిల్లాలో క్రీడా మైదానాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలేమిటి?.
ప్రధానంగా జిల్లా కేంద్రంలో రాజీవ్‌ క్రీడా ప్రాంగణం, విజ్జి మైదానానికి నిత్యం ప్రజలకు, వేలాది మంది క్రీడాకారులు వస్తున్నారు. వీటిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. త్వరలోనే విజ్జి స్టేడియంలో ఆరు కోట్లతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియం వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రాజీవ్‌ క్రీడా మైదానంలో మరుగుదొడ్లు, స్టేడియం మరమ్మతులు చేపడుతున్నాం. కొండవెలగాడలో ఉన్న క్రీడా ప్రాంగణానికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తాం. రాజీవ్‌ మైదానంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సహకారంతో వాటర్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తాం.