Aug 20,2023 20:49

డిఎఫ్‌ఒ జిఎపి ప్రసూన

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి : ప్రకృతికి భంగం కలగడం వల్లే పులులు, ఏనుగుల నుంచి ప్రమాదాన్ని చవిచూడాల్సి వస్తోందని మన్యం జిల్లా అటవీశాఖ అధికారి, విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జి డిఎఫ్‌ఒ జిఎపి ప్రసూన తెలిపారు. సహజ సిద్ధమైన అడవుల్లో మానవాళి కదలికలు ఎక్కువైనప్పుడు, అక్కడ నివశిస్తున్న జంతువులు ఇతర ప్రాంతాల్లోకి దిశమార్చుకుంటాయని వివరించారు. ప్రస్తుతం పులి పాలకొండ, భామిని ఏజెన్సీలోనూ, ఏనుగులు కొమరాడ ప్రాంతంలోనూ సంచరిస్తున్నాయని వెల్లడించారు. వాటి బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా పులి బొండపల్లి మండలం వెదురువాడ పంచాయతీ పనసలపాడు వద్ద ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో మినహా ఎక్కడ స్థిరంగా ఉండడం లేదన్నారు. అనుకూలమైన స్థావరం దొరికే వరకూ పులి సంచరిస్తూనే ఉంటుందని వివరించారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండడమే ఏకైక మార్గమన్నారు. విజయనగరం, మన్యం జిల్లాల్లో సంచరిస్తున్నది పెద్దపులిగానే పరిగణిస్తున్నామని స్పష్టంచేశారు. ఈ వారంన తనను కలిసిన ప్రజాశక్తికి డిఎఫ్‌ఒ ప్రసూన ముఖాముఖీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు...
పులి ఎక్కడి నుంచి? ఎందుకు వచ్చినట్టు?.
పులి ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే పాపికొండల్లో మినహా శ్రీకాకుళం, పార్వతీపురం, పాడేరు ఏజెన్సీల్లో పులులు ఉన్నట్టు మా రికార్డుల్లో కూడా లేదు. పులి స్థావరం ఉన్న ప్రాంతంలోకి జనాలు ప్రవేశించినప్పుడు లేదా పెద్దపెద్ద శబ్దాలు, మంటలు వంటివి ఏర్పడినప్పుడు పులులు వాటి స్థావరాన్ని మార్చుకుంటాయి. అటువంటి సందర్భాల్లో అనుకూలమైన స్థావరం దొరికే వరకూ సంచరిస్తూనే ఉంటాయి. పాపికొండలు లేదా ఒడిశా, చత్తీస్‌గడ్‌ అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉండవచ్చు. సాధారణంగా మైనింగ్‌, రోడ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు అవి తమ దిశ మార్చుకుంటాయి.
ప్రస్తుతం పులి ఎక్కడ ఉంది?.
ప్రస్తుతం మన్యం జిల్లా పాలకొండ, భామిని ఏజెన్సీలో సంచరిస్తున్నట్టుగా ఆనవాళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భామిని మండలంలోని 52 గ్రామాల ప్రజానీకాన్ని అప్రమత్తం చేశాం. సాయంత్రం, తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని ప్రచారం చేపట్టాం.
మన ప్రాంతంలో సంచరిస్తున్నది చిరుతా? పెద్ద పులా?.
మన ప్రాంతంలో సంచరిస్తున్నది పెద్ద పులి. చిరుత కానే కాదు. పులిసైజును బట్టి ఆడ, మగ అనేది గుర్తిస్తాం. రంగులను బట్టి పెద్దపులా? చిరుత అనేది గుర్తించవచ్చు. పెద్ద పులి చర్మంపై చారులు కనిపిస్తాయి. అదే చిరుత అయితే చుక్కలు ఉంటాయి. చారులు కనిపిస్తున్నాయి కాబట్టి పెద్ద పులిగా భావించవచ్చు. దీన్ని సిసి కెమెరాల ఆధారంగా గుర్తించాం.
పులి అనుకూల స్థావరాలు ఎలా ఉంటాయి?.
సాధారణంగా పులులు గిరిశిఖర గ్రామాల్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. కనీసం 15 నుంచి 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో సంచరిస్తుంది. ఆయా పరిసర ప్రాంతంలో మరో పులి ఉండేందుకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే పిల్లలతో ఉన్న పులులు మినహా ఆడైనా, మగైనా అన్నీ ఒంటరిగానే ఉంటాయి.
పులి ఎన్నిచోట్ల దాడికి పాల్పడింది?.
పులి సంచరిస్తున్న ప్రతి ప్రాంతంలోనూ దాడికి ప్రయత్నించింది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు చోట్ల, విజయనగరం జిల్లాలో నాలుగు చోట్ల పశువులు, మేకలు, గొర్రెలపై దాడికి పాల్పడింది.
పులిని బంధించి, వాటికి అనుకూలమైన ప్రదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారా?.
వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం పులిని సురక్షితంగా బంధించి, స్థావరానికి అనుకూలంగా ఉండే అటవీ ప్రాంతానికి తరలించే ఆలోచనలోనే ఉన్నాం. అందుకనుగుణంగా ఆపరేషన్‌ చేపట్టాం. ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మెంటాడ, గంట్యాడ, బొండపల్లి, దత్తిరాజేరు, పాలకొండ సహా పులి సంచరించినట్టు ఆనవాళ్లున్న అన్ని ప్రాంతాల్లోనూ ఆపరేషన్‌ చేపడుతున్నాం. ముఖ్యంగా బొండపల్లి మండలం వెదురవాడ పంచాయతీ పనసలపాడు వద్ద గల దట్టమైన అటవీ ప్రాంతంలో వద్ద ఎక్కువ రోజులు ఉన్నట్టుగా గుర్తించి, అక్కడ ప్రత్యేక ట్రాక్‌ కేజ్‌ ఏర్పాటు చేసి బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. కానీ, అది తెలివిగా తప్పించుకుంటోంది. మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.