ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం ఆధ్వర్యాన బుధవారం నుంచి సెప్టెంబర్ 4 వరకు ఆరు రోజులపాటు సమరభేరీ మోగించనున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సమస్యలను పరిష్కరించాలని, భారాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమరభేరి నిర్వహించేందుకు పార్టీ పిలుపునిచ్చింది. దీన్ని విజయవంతం చేయాలంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తదితరులు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఏటా కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కేంద్రం మాట నిలబెట్టుకోలేదు. పైగా అవలంభించిన విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో, నిరుద్యోగ సమస్యను మరింత తీవ్రతరమైంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ వంటి సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు కంకణం కట్టుకుంది. దీంతో, ఉద్యోగులకు మరిన్ని సమస్యలు ఉత్పన్నం కావడంతోపాటు భవిష్యత్ తరాలకు ప్లాంట్‌లో ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయి. మరోవైపు పెంచిన నిత్యావసర సరుకుల ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ ఛార్జీలు, చెత్తపన్ను వంటివి మరింత గుదిబండగా పరిణమించాయి. ఇటీవల పెంచిన విద్యుత్తు ఛార్జీలు కూడా భారమయ్యాయి. జిల్లాలో జూట్, ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల మూత వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పాలకుల నిర్లక్ష్యం వల్ల జిల్లా ప్రజలు వలసలు కూడా ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 30న ప్రభుత్వ మోసపూరిత విధానాలపై ప్రచారం, సంతకాల సేకరణ, సెప్టెంబర్ 1 గ్రామ, వార్డు సచివాలయాల్లో వినతుల సమర్పణ, 3న నిరుద్యోగ వ్యతిరేక దినం, 4న మండల కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు సిపిఎం ఆధ్వర్యాన చేపట్టనున్నారు.










