ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని, భారాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమరభేరి నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా నిరసన కార్యక్రమం గోడ పత్రికను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. గద్దెనెక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై పన్నులు భారాన్ని మోపుతోందన్నారు.ఈ విధానాలను జగన్ ప్రభుత్వం వ్యతిరేకించకుండా మోడీ భజనచేస్తూ ఆ విధానాలనే అత్యుత్సాహంతో అమలు చేస్తున్నారని అన్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా, దేశవ్యాపితంగా ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అధిక ధరలను అదుపు చేయాలని, సరసమైన ధరలకు నిత్యావసరాలు అందించాలని, విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని సిపిఎం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని తెలిపారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన మోడీ ఆచరణలో సంవత్సరానికి కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. జిల్లా లో పరిశ్రమలు మూత పడి కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మూసివేసిన పరిశ్రమలు తెరిపిస్తే వేలాది మంది ఉపాధి కలుగుతుందన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల జిల్లా ప్రజలు వలసలు పోతున్నారని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న ఈ భారాలకు వ్యతిరేకంగా ఈనెల 30 నుంచి ప్రచారం, సంతకాల సేకరణ, సెప్టెంబర్ 1 గ్రామ, వార్డు సచివాలయాల్లో వినతుల సమర్పణ, 3న నిరుద్యోగ వ్యతిరేక దినం, 4న మండల కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తమ్మినేని తెలిపారు. జిల్లా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ, ఎ.జగన్మోహన్ పాల్గొన్నారు.










