Aug 18,2023 21:39

మాట్లాడుతున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే అక్కసుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. శుక్రవారం విజయనగరంలోని తన నివాసం వద్ద నియోజకవర్గ జెసిఎస్‌ నమోదు శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ కన్వీనర్లకు పార్టీ తరపున బీమా చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని అని చెబుతున్న అమరావతిలో సాయంత్రం 5గంటలు దాటితే టీ కూడా దొరకదని చెప్పారు. అమరావతిని చూసి భయపడిన పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సాహసించలేకపోయారని గుర్తుచేశారు. మరో హైదరాబాద్‌ మాదిరి విశాఖ అభివృద్ధి చెందగలదని తెలిపారు. ఇదే జరిగితే జగన్‌కు పేరు వస్తుందన్న అక్కసుతోనే ప్రతిపక్ష నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 2014లో జాబు కావాలంటే బాబు రావాలని, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు... వారందరినీ నిలువునా ముంచారని విమర్శించారు.
ఆస్తులను అమ్మిన చరిత్ర అశోక్‌ది
నియోజకవర్గంలో అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న టిడిపి నాయకులు వాస్తవాలను తెలుసుకోవాలని కోలగట్ల హితవుపలికారు. అశోక్‌ హయాంలో 9 వేల గజాలున్న విలువైన ప్రదేశంలో ఆర్‌డిఒ కార్యాలయ స్థలాన్ని అమ్మారని.. సర్కస్‌ గ్రౌండ్‌, పాత బస్టాండ్‌ దగ్గర ఉన్న క్యాటిల్‌ డిపో, రింగ్‌ రోడ్‌లో డంపింగ్‌ యార్డ్‌ స్థలాలను సైతం విక్రయించారని తెలిపారు. వచ్చిన డబ్బులతో కోట చుట్టూ సుందరీకరణ, కోటలో మ్యూజియం అన్నారని.. నేడు అవి ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. తాను ప్రభుత్వ స్థలాలు అమ్మినట్లు నిరూపిస్తే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. గతంలో అన్న క్యాంటీన్ల పేరుతో పేదలకు పెట్టే భోజనంలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కార్యక్రమంలో జెసిఎస్‌ కన్వీనర్లు ఆశపు వేణు, ఎస్‌వివి రాజేష్‌, సంగం రెడ్డి బంగారు నాయుడు, ముద్దాడ మధు, మేయర్‌ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయ, తదితరులు పాల్గొన్నారు.