Sep 07,2023 21:32

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  విజయనగరం జిల్లా ప్రజల చిరకాల కోరికైన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రానున్నారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. ఈనెల 14 లేదా 15వ తేదీన సిఎం పర్యటన ఉంటుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు. సిఎం పర్యటన నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గురువారం విజయనగరంలోని తన నివాసం వద్ద ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన విజయనగరం జిల్లాను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకు వెళ్లాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారని, ఇటీవలే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. వీటితోపాటు జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేయడమే కాక, నేడు తరగతులనూ ప్రారంభించుకున్నామని వివరించారు. విజయనగరం నియోజకవర్గ పరిధిలోని గాజులరేగ వద్ద నిర్మిస్తున్న వైద్య కళాశాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సమీపంలోనే బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. గిరిజన వర్సిటీ, జెఎన్‌టియు స్థాయి పెంపు, వైద్య కళాశాల మంజూరు ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభమైతే ఇక్కడే అత్యాధునిక వైద్య సేవలు అందుతాయని, స్పెషలిస్ట్‌ వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. విజయనగరం నియోజకవర్గానికి గతంలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్సవానికి, గుంకలాంలో జగనన్న లేఅవుట్‌ ప్రారంభానికి ముఖ్యమంత్రి విచ్చేశారని.. ప్రస్తుతం మూడోసారి రానున్నారని తెలిపారు.పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నామని కోలగట్ల తెలిపారు.