
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. మన్యం జిల్లాలో వరదనీరు పోటెత్తడంతో నదులు, వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహించాయి. తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్ ప్రాజెక్టులు నిండుకుండల్లా నీటితో తొణికిసలాడుతున్నాయి. నదులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పార్వతీపురం పట్టణ శివారు కాలనీలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వీరఘట్టం మండలం నడుకూరులో, పార్వతీపురం మండలంలో జంఝావతి కాలువకు గండి పడటంతో పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి.
జంఝావతి కాలువకు గండి
రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామం మీదుగా గరుగుబిల్లి వెళ్తున్న జంఝావతి కాలువకు గురువారం ఉదయం గండి పడింది. ఆ కాలువ గట్టు తెగడంతో పార్వతీపురం- పాలకొండ రోడ్డుపై వరద నీరు ప్రవహించింది. దీంతో గ్రామంలో రాకపోకలు స్తంభించాయి. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఉప్పొంగిన సాకిగెడ్డ
భారీవర్షాల కారణంగా మండలంలోని పుట్టూరు - లచ్చిరాజుపేట గ్రామాల మధ్య ఉన్న సాకిగెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గురువారం సుమారు 45 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో ఇదే సాగి గడ్డ పొంగి వేల ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితితో లచ్చిరాజుపేట సెంటర్ నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిండుకుండలా పెద్దగెడ్డ
పాచిపెంట : మండలంలోని పెద్దగెడ్డ జలశయం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండుకుండను తలపిస్తోంది. జలాశయం పూర్తి నీటిమట్టం 213.8 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 212 మీటర్లు ఉంది. ప్రస్తుతం వర్షాల కారణంగా జలాశయంలోకి 170 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు 130 క్యూసెక్కుల నీరు విడిచి పెడుతున్నట్లు డిఇ పి.కనకారావు తెలిపారు.
తోటపల్లికి భారీగావరద నీరు
గరుగుబిల్లి : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో తోటపల్లి రిజర్వాయరులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోందని ఎఇ శ్రీనివాసరావు తెలిపారు. రిజర్వాయరు సామర్థ్యం 2.534 టిఎంసిలు కాగా, గురువారం సాయంత్రానికి 2.278 టిఎంసిలకు చేరినట్లు చెప్పారు. రిజర్వాయరు పూర్తి నీటిమట్టం 105 మీటర్లకు గాను ప్రస్తుతం 104.62 మీటర్లకు చేరినట్లు వెల్లడించారు. ఇన్‌ఫ్లో 5845 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 4213 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. నాగావళి నది ద్వారా 2943 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 280 క్యూసెక్కులు, పాత కుడి ప్రధాన కాలువ ద్వారా 90, కొత్త కుడి ప్రధాన కాలువ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. దిగువ ప్రాంతం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
వంద ఎకరాల్లో పంటమునక
వీరఘట్టం : మండలంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నడుకూరు గ్రామ సమీపంలో 100 ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. మొన్నటివరకు సాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడి మోటార్ల సహాయంతో పంటలు సాగు చేశారు. రెండు రోజులుగా వర్షాల కారణంగా సీతమ్మ సాగరం చెరువు నీరు పంట పొలాలపై ప్రవహించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే, పంటలపై ఆశలు వదులుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉధృతంగా వట్టిగెడ్డ
వీరఘట్టం మండలంతోపాటు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడటంతో పైనుంచి వచ్చిన వరదల కారణంగా వట్టిగడ్డలో నీటి ప్రవాహం అమాంతంగా పెరిగింది. వట్టిగడ్డకు సమీపంలో నివశిస్తున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కూడా వర్షాల కారణంగా వట్టిగడ్డలో నీటి ప్రవాహం క్రమేపీ పెరిగిపోవడంతో గృహాల్లోకి చేరింది. అప్పట్లో స్థానికులు ఎగువ ప్రాంతానికి వచ్చి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ పరిస్థితి రాకముందే అధికారులు వట్టిగడ్డ పరివాహక ప్రాంతాలను సందర్శించి, ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మడ్డువలసకు భారీగా వరద నీరు
వంగర : ఎగువ ప్రాంతాలతో పాటు, జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి మండలంలోని మడ్డువలస ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇంతవరకు వర్షాలు లేకపోవడంతో సువర్ణముఖి, వేగావతి నదులు నుంచి 1500 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చేది. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ఈ రెండు నదుల నుంచి దాదాపు 6వేల క్యూ సెక్కుల వరద నీరు మడ్డువలస ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది.ప్రాజెక్ట్ లెవెల్ నీటిమట్టం 65 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 64.10 లెవెల్ నీటిమట్టం ఉందని, సువర్ణముఖి వేగావతి నదుల నుంచి గురువారం నాటికి 5,172 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిందనిప్రాజెక్టు ఎఇ నితిన్ కుమార్ తెలిపారు. ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. కుడి ఎడమకాలువల ద్వారా 610 క్యూసెక్కుల నీరు ఆయకట్టుకు వెళ్లగా 1 ప్రధాన గేటుద్వారా 1723 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టినట్లు వెల్లడించారు.
నాగావళి నదిలో పెరిగిన నీటి ప్రవాహం
నాగావళి నదిలో ఒక్కసారిగా గురువారం నీటి ప్రవాహం పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలు కారణంగా తోటపల్లి ప్రాజెక్టు భారీ వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. దీంతో నాగావళి నదిలో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో మండలంలోని శివ్వాం, వివిఆర్‌పేట రేవులు వద్ద నాటు పడవలను నిర్వాహకులు నిలిపివేశారు.










