ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని రహదారుల అభివృద్ధి పనులను పైడితల్లి అమ్మవారి పండగకు ముందే పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సూచించారు. గురువారం నగరంలోని మయూరి కూడలి నుంచి బాలాజి జంక్షన్ వరకు చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులను, ఎత్తు బ్రిడ్జి దిగువన నూతనంగా నిర్మించబోయే మోడ్రన్ బస్టాప్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నగరపాలక సంస్థ, ఆర్‌అండ్‌బి అధికారులకు, కాంట్రాక్టర్లకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం నగర కమిషనర్ ఆర్.శ్రీరాములు నాయుడు మీడియాతో మాట్లాడారు. మయూరి కూడలి నుంచి సెంటర్ డివైడర్లు, బ్యూటిఫికేషన్ పనులపై డిప్యూటీ స్పీకర్ సూచనలు చేశారన్నారు. అక్టోబర్ 15 నాటికి ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
ఎత్తుబ్రిడ్జి వద్ద బస్సులు ఆగి వెళ్తుండటం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటోందని, ఈ నేపథ్యంలో ఇక్కడ మోడరన్ బస్టాప్ నిర్మించనున్నామని తెలిపారు. ఇప్పటికే ఇక్కడ సుమారు రూ.25 లక్షలతో వివిధ పనులు చేపడుతున్నామన్నారు. కాకినాడకు చెందిన ఓ సంస్థ భాగస్వామ్యంతో ఆధునిక హంగులతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ బేను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇక్కడ రెస్ట్ రూములు, తాగునీరు, ఎసి, ఎటిఎం వంటి సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇఇ కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.










