Aug 25,2023 20:32

వాటర్‌ ట్యాంకర్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌ శ్రీరాములు నాయుడు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్‌ శ్రీరాములు నాయుడు శుక్రవారం పర్యటించారు. నీటి పంపిణీ, పారిశుధ్యం, పార్కుల నిర్వహణ, వాటర్‌ ట్యాంకుల పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో చేపడుతున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. నగరంలో మహిళా పార్కును పరిశీలించి మొక్కల సంరక్షణ పట్ల తీసుకుంటున్న చర్యలను అడిగారు. నీటి పంపిణీ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించారు. పైప్‌లైన్‌ లీకులను సరిచేయాలని ఇంజినీరింగ్‌ సిబ్బందికి ఆదేశించారు. ఎక్కడా బురద నీరు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో సంపూర్ణ పారిశుధ్యానికి తాము చేస్తున్న కషికి ప్రజలు కూడా సహకరించాలన్నారు. రోడ్లపై విచ్చలవిడి అమ్మకాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. గంట స్తంభం, కన్యకా పరమేశ్వరి ఆలయం తదితర జన సమర్ధ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు ఇబ్బందికర పరిస్థితుల్లో అమ్మకాలను సాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వీరి వల్ల ప్రధాన రహదారులు చెత్తాచెదారులతో నిండిపోతున్నాయని, ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో చిరు వ్యాపారుల అమ్మకాలను క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు.