Aug 28,2023 21:11

ఆర్‌బికెను ప్రారంభిస్తున్న జెడ్‌పి చైర్మన్‌, డిప్యూటీ స్పీకర్‌

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని నమ్మిన ముఖ్యమంత్రి జగన్‌... ఆ దిశగానే సచివాలయం వ్యవస్థను అమలు చేసి, ప్రజల వద్దకే అన్ని రకాల ప్రభుత్వ సేవలనూ తీసుకొచ్చారని ఎపి శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండలంలోని కోరుకొండ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ (వెల్నెస్‌ సెంటర్‌)లను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యఅతిథి జెడ్‌పి చైర్మన్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యం సాధన దిశగా సచివాలయ వ్యవస్థతో పాటు వివిధ రకాల ప్రభుత్వ సేవలను ముఖ్యమంత్రి జగన్‌ తీసుకువచ్చారని చెప్పారు. అన్ని సేవలూ సచివాయల్లోనే లభిస్తున్నాయన్నారు.కోరుకొండ, కోరుకొండపాలెం గ్రామాల్లో 1,426 గడపలుంటే.. ఈ నాలుగేళ్ల నాలుగు నెలల కాలంలో సుమారు రూ.18.50 కోట్లను వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయని వివరించారు. స్థానికంగా యువత కోసం వ్యాయామశాలకు అవసరమైన పరికరాలను జిల్లా పరిషత్తు నిధుల నుంచి సమకూరుస్తామని హామీ ఇచ్చారు. గత టిడిపి ప్రభుత్వం మాదిరి ఎన్నికల రాజకీయాలు చేయలేమని స్పష్టం చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఈ గ్రామ అభివృద్ధి తన బాధ్యతన్నారు. గత ప్రభుత్వం మాదిరి పథకానికో రేటు పెట్టే పరిస్థితి ఇప్పుడు లేదని, నాలుగేళ్ల కాలంలో అవినీతిరహిత పాలన అందించామని చెప్పారు. గ్రామస్థుల కోరిక మేరకు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తామని, లైన్‌మెన్‌ను నియమిస్తామని, ఇతర పెండింగు పనులనూ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు కెల్ల శ్రీనివాసరావు, ఎఎంసి మాజీ చైర్మన్‌ నడిపేన శ్రీనివాసరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కెల్ల త్రినాథ్‌, సర్పంచ్‌ మైలపల్లి శంకరరావు, మాజీ సర్పంచ్‌ లగుడు శివాజీ, ఎంపిడిఒ జి.వెంకటరావు, వ్యవసాయ శాఖ ఎఒ ఉమామహేశ్వరరావు, రాకోడు పిహెచ్‌సి వైద్యాధికారి జగదీష్‌, ఎంపిటిసి సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.