ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తీవ్ర మనోవేదనతో సతమతమవు తున్న ఓ తల్లి.. తన ఇద్దరు పిల్లలకు విషం పట్టి, అనంతరం ఆమె కూడా విషం తాగిన ఘటన విజయనగరంలో రెండు రోజుల క్రితం వెలుగు చూసింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. హృదయ విదారకరమైన ఈ ఘటన జిల్లా కేంద్రంలోని కామాక్షినగర్ రెండు రోజుల కిందట చోటు చేసుకోగా, మంగళవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన బి.హైమావతి (29)కు, తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌కు చెందిన వి.కుమార్‌తో నాలుగేళ్ల క్రితం వివాహ మైంది. కుమార్ ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. హైమావతి విజయనగరం కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలో కార్యాలయ సబార్డినేటుగా చిరుద్యోగం చేస్తుంది. వీరికి మూడేళ్ల పాప లతిక్ష, ఏడాదిన్నర బాబు ఉన్నారు. హైమావతి తండ్రి కృష్ణ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసి విధి నిర్వహణలో చనిపోయారు. కృష్ణకు లలిత, హైమావతి, సుమ ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. అందులో హైమావతి రెండో సంతానం. తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద హైమావతికి ఉద్యోగం ఇచ్చారు. భర్త ఉద్యోగం వల్ల దూరంగా ఉండటం, తాను నిరంతరం కార్యాలయంలో పనిచేస్తుండటం, పిల్లల ఆలనా, పాలనాకు దూరమవుతున్నారనే మనో వేదన ఆమెను కలచివేసింది. ఈనెల 10న ఉదయం 9గంటల సమయంలో గడ్డి మందును పిల్లలకు పట్టి.. ఆ తరువాత ఆమె కూడా తాగేసింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని హైమావతి సోదరి సుమ గమనించి వెంటనే 108కు సమాచారం ఇచ్చి తొలుత ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించేందుకు విశాఖపట్నం కెజిహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. అయితే సమయం లేదని నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల పరిశీలించి పిల్లల పరిస్థితి బాగోలేదని వెంటనే విశాఖపట్నం తరలించాలని సూచించడంతో పిల్లల్ని విశాఖ తరలించారు. చికిత్స పొందుతూ హైమావతి చనిపోగా, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలి తల్లి బి.సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఒకటో పట్టణ ఎస్‌ఐ మురళి తెలిపారు.










