May 10,2023 00:02

సీలేరులో కురుస్తున్న వర్షం

ప్రజాశక్తి-సీలేరు
జీకే వీధి మండలం సీలేరులో మంగళవారం పగలంతా భానుడు భగభగ మండిపోగా, సాయంత్రానికి వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. నాలుగైదు రోజుల నుంచి అడపా దడప సీలేరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు పెద్దగా తగ్గకపోగా, మంగళవారం ఉదయం నుంచి భానుడు భగభగ మండిపోవడంతో మధ్యాహ్నం సమయానికి 38 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు సాహసించడం లేదు. ఏదైనా పని ఉంటే గొడుగు వేసుకొని బయటకొచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రకంగా ఎండకాయడంతో ఎండ వేడి అధికంగా ఉంది. దీనికి ఉక్కబోత తోడు కావడంతో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు విలవిలలాడిపోయారు. కొంత మంది ప్రకృతి ఒడిలో పచ్చని చట్లు కింద సేద తీరగా, మరికొంత మంది ప్రజలు ఏసీలు కూలర్లు వేసుకొని ఇళ్లకే పరిమితమయ్యారు.
కుండపోత వర్షం
ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపగా, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై భారీ ఈదురుగాలులు, ఉరుములతో సాయంత్రం 6.40 నుండి కుండపోత వర్షం కురిసింది. మునుపేన్నడు లేనివిధంగా ఒక్కసారిగా కుంభవృష్టి వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి. రాత్రి 7.30 వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో సీలేరు పరిసర ప్రాంతాలో చల్లటి వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంగళవారం నుంచి అగ్నికరితలు ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలలు వీసే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.