ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన నగరంలోని సిఎంఆర్ కూడలి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందిస్తూ సువర్ణ పరిపాలనకు వైఎస్ నాంది పలికారని గుర్తు చేశారు. సుపరిపాలనతో ప్రజల హదయాలలో చెరగని ముద్ర వేశారని అన్నారు. పేద విద్యార్థులూ ఉన్నత చదువులు చదివి, నేడు మంచి స్థాయిలో ఉన్నారంటే అది వైఎస్ వల్లేనని.. ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని చెప్పారు. వైఎస్సార్ ఆశయ సాధన లక్ష్యంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. అవినీతిపై పోరాటం చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారని.. అసలు రాష్ట్రంలో అవినీతి ఎక్కడ జరుగుతోందని కోలగట్ల ప్రశ్నించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే సేవలు అందిస్తున్నామని చెప్పారు. అనంతరం నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను ఈ సందర్భంగా అందజేశారు. ఎక్కడైనా కొంతమంది మహిళలు ఒక్కటై ఉపాధి కోసం కుట్టు మిషన్లు కావాలనుకుంటే తాము అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజశేఖర్ రెడ్డి సేవలు ఎనలేనివి
విజయనగరం కోట : మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్ కొనియాడారు. శనివారం రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి పురస్కరించుకొని స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్ర ప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. రాజీవ్ గృహ కల్ప, ఆరోగ్యశ్రీ వంటి అనేక పథకాలు పెట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారని అన్నారు. పట్టణ అధ్యక్షులు సుంకర సతీష్, డెంకాడ మండలం నుంచి కంది చంద్రశేఖర్, సూరిబాబు, గురువులు అబ్దుల్, సూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.










