Aug 21,2023 21:09

బ్రోచర్‌ను అందిస్తున్న ఎమ్మెల్యే శంబంగి

ప్రజాశక్తి- బాడంగి : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. మండలంలో గూడెపు వలస సచివాలయం పరిధిలో రావివలస, పూడివలస గ్రామాల్లో సోమవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి మూడేళ్ళ పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. పథకాలకు ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ పేదవాడు ఏ పార్టీలో ఉన్నాసరే వారికి సంక్షేమ పథకాలు అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎలాంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అర్హులైన వారికి నేరుగా వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. మూడేళ్ళలో ఆ కుటుంబం పొందిన లబ్ధిని ఎమ్మెల్యే శంబంగి వివరించి బుక్‌ లేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల పార్టీ అధ్యక్షులు శంబంగి వేణుగోపాలనాయుడు, జెడ్‌పిటిసి పెద్దింటి రామారావు, జెసిఎస్‌ కన్వీనర్‌ మరిపి శంకర్‌రావు, ట్రైకర్‌ డైరెక్టర్‌ చిన్నపుదొర, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.