ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలో కుళాయిల నుంచి బురద నీరు వస్తుందన్న ఫిర్యాదుల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం ఆకస్మికంగా పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ మార్గంలో పైప్ లైన్లు పాడవ్వడాన్ని గుర్తించి, వెంటనే అధికారులను పిలిపించి తగు సూచనలు చేశారు. అధికారులు వచ్చేంతవరకు సుమారు అరగంట పాటు జెడ్‌పి కార్యాలయం సమీపంలో రహదారి పక్కనే కూర్చున్నారు. పైప్ లైన్లకు లీకేజీలు ఉండటం వల్ల నీరు కలుషితమవు తోందని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. నగర సుందరీకరణ కోసం రైల్వే స్టేషన్ మార్గంలో డివైడర్ల వద్ద నిర్వహణ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పైడితల్లి అమ్మవారి వనం గుడి ఎదురుగా దుకాణ సముదాయాల వద్ద కాలువ పైప్ లైన్లు పగిలి మురుగునీరు రహదారిపైకి వస్తుండడంతో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం వైఎస్సార్ సర్కిల్ వద్ద పెద్ద చెరువును పరిశీలించి తగు సూచనలు చేశారు. పెద్ద చెరువును ఆనుకొని ఆక్రమణలు వెలుస్తుండడంతో, వెంటనే తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. ఆయన వెంట నగర పాలక సంస్థ అధికారులు ఉన్నారు.










