ప్రజాశక్తి-విజయనగరం : పరిపాలనలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పరిపాలన సంబంధమైన విషయాల్లో సంయమనం పాటిస్తూ, ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ వ్యవహరించాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఆరు రోజుల రిప్రెషర్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధించడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. గ్రామాల అభివద్ధిలో ముఖ్య భూమిక కార్యదర్శులదేనిని అన్నారు. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం, విద్యుత్ దీపాల నిర్వహణ తదితర అంశాలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఎంతో ఆత్మ సంతృప్తి లభిస్తుందని అన్నారు.
కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ వత్తి నైపుణ్యాన్ని, పనితీరును మెరుగుపరచుకోవడానికి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు ప్రజలకు అతి దగ్గరగా ఉండే ప్రభుత్వ యంత్రాంగం పంచాయతీ కార్యదర్శులు వ్యవస్థ అని పేర్కొన్నారు. వీరు అందించే సేవలు, పని తీరును బట్టి ప్రజలు ప్రభుత్వంపై ఒక అవగాహన ఏర్పరచుకుంటారని చెప్పారు. ముఖ్యంగా పంచాయతీలకు ఆదాయ వనరులు ఎంతో కీలకమని, పన్నుల వసూలు పై దృష్టి పెట్టాలని సూచించారు. స్వామిత్వ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ కె.రాజ్ కుమార్, డిపిఒ శ్రీధర్‌రాజా పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణకు సంభందించిన పుస్తకాలను పంపిణీ చేశారు.










