ప్రజాశక్తి-విజయనగరం : క్షేత్రస్థాయిలో పని చేసే పంచాయతీ కార్యదర్శులు అన్ని రకాల పరిపాలనాపరమైన అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలనిరాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శిక్షణ సంస్థ (ఎపి ఎస్‌ఐఆర్‌డి అండ్ పిఆర్) డైరెక్టర్ జె. మురళీ సూచించారు. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో సోమవారం ప్రారంభమయ్యింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పంచాయతీ రాజ్ చట్టం, 73వ రాజ్యాంగ సవరణ, ఇతర న్యాయపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లా ఆఫీస్ మాన్యువల్, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్, లేఅవుట్ల అనుమతులు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, స్వామిత్వ, డ్రాఫ్టింగ్ తదితర అంశాలపై లోతైన విశ్లేషణ చేస్తూ తన అనుభవాలను కార్యదర్శులతో పంచుకున్నారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలు, మెమో సర్యులర్ల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. న్యాయ పరమైన అంశాలు, కేసులను అధ్యయనం చేయాలని నిబంధనకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జెడ్‌పి సిఇఒ రాజ్ కుమార్, డిపిఒ శ్రీధర్ రాజా పరిపాలనా పరమైన పలు అంశాలపై అవగాహన కల్పించారు. రెండో దశ శిక్షణకు విజయనగరం జిల్లా నుంచి 150 మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 100 హాజరయ్యారు.










