Aug 30,2023 21:03

సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నాగలక్షి ్మ

ప్రజాశక్తి-డెంకాడ : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రత్యేక దృష్టిసారించారు. ఈ ప్రక్రియను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డెంకాడ మండల కేంద్రంలో స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. ఓటర్ల చేర్పులు, తొలగింపులకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు. ఓటర్లతో మాట్లాడి, వారు అందజేసిన దరఖాస్తులను నిర్ధారించారు. ఇంటింటి సర్వే వివరాలను తెలుసుకున్నారు.
సచివాలయం తనిఖీ
ముందుగా పినతాడివాడ గ్రామ సచివాలయాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. బడి ఈడు వయసు వారంతా తప్పనిసరిగా బడుల్లో ఉండాలని ఆదేశించారు. పాఠశాలల్లో శతశాతం చేరికలు జరగాలని స్పష్టం చేశారు. వలస వెళ్లిన వారు కూడా ఎక్కడో ఒక చోట బడిలో చేరిందీ, లేనిదీ ఆరా తీయాలని సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు, క్లాప్‌మిత్రలకు జీతాల చెల్లింపు, ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రామ్‌, పిఎం కిసాన్‌ పోర్టల్లో నమోదు, మధ్యాహ్న భోజన పథకం, రక్తహీనత కేసులు, తదితర అంశాలపై ఆరా తీశారు.
సర్వే ప్రక్రియ పరిశీలన
జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం కింద పినతాడివాడ గ్రామంలో చేపట్టిన స్వామిత్వ సర్వేని కలెక్టర్‌ పరిశీలించారు. గ్రామంలో ఇంతవరకు జరిగిన సర్వే ప్రక్రియపై ఆరాతీశారు. రోవర్‌ పనితీరు, రాళ్లు పాతే ప్రక్రియను పరిశీలించారు. సర్వే వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
ఆరోగ్య పరిరక్షణపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గొడ్డుపాలెం గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామంలో వ్యాధిగ్రస్తులు, వారికి ఇస్తున్న మందులపై ఆరాతీశారు. డయేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకొని, రక్షిత తాగునీటి సరఫరాపై ప్రశ్నించారు.
ప్రాధాన్యత భవనాలను పూర్తి చేయాలి
ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గుణుపూరుపేటలో నిర్మాణంలో ఉన్న సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్లను కలెక్టర్‌ పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను వారంలో పూర్తిచేసి, వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పర్యటనలో జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌, ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, డిఎల్‌డిఒ లక్ష్మణ్‌, తహశీల్దార్‌ ఆదిలక్ష్మి, ఎంపిడిఒ స్వరూపరాణి, తదితరులు పాల్గొన్నారు.
గొడ్డుపాలెం గ్రామానికి డెంకాడలో సేవలు
గతంలో ఉన్న మాదిరిగానే గొడ్డుపాలెం గ్రామానికి డెంకాడ పిహెచ్‌సిలో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మోపాడ పిహెచ్‌సిలో వైద్య సేవలు వద్దని డెంకాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందించాలని గొడ్డుపాలెం గ్రామానికి చెందిన ప్రజలు కోరినట్లు ప్రజాశక్తి పత్రికలో వచ్చిన కథనాన్ని గ్రామ సర్పంచ్‌ కలిశెట్టి రామకృష్ణ, ఎంపిటిసి విజినగిరి అచ్చంనాయుడు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె వెంటనే స్పందించి మ్యాపింగ్‌ సెక్షన్‌ పరిశీలించి బంగారు రాజుపేటను మోపాడ ఆరోగ్య కేంద్రంలోనూ, గొడ్డుపాలెం గ్రామాన్ని డెంకాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మార్పు చేయాలని ఆదేశించారు.