ప్రజాశక్తి-గరివిడి, చీపురుపల్లి : జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటింటి ఓటర్ల సర్వేపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా, గ్రామస్థాయిలో ఓటర్ల సర్వే సక్రమంగా జరిగిందా? లేదా, బిఎల్‌ఒలు ఇంటింటికీ వచ్చారా? లేదా అని గ్రామీణులను ఆరా తీశారు. ఓటర్ల చేర్పులు, తొలగింపుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు తమ సమస్యలను తెలిపారు. చీపురుపల్లి, గరివిడి మండలాల్లో జిల్లా కలెక్టర్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా గరివిడి మండలం మందిరివలస చేరుకున్న కలెక్టర్.. నిర్మాణంలో ఉన్న సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ భవనాలను పరిశీలించారు. మరో 15 రోజుల్లో పనులు పూర్తి చేసి, భవనాలను ప్రారంభించాలని ఆదేశించారు. సచివాలయాన్ని తనిఖీ చేసి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ఆరాతీశారు. విద్యార్థుల చేరికలపై క్లష్టర్ల వారీగా వాలంటీర్లతో సమీక్షించారు. అనంతరం కొండశంబాంలో కలెక్టర్ పర్యటించి, రీసర్వే పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఓటర్ల జాబితా సవరణపై ఇంటింటికీ వెళ్లి ఆరాతీశారు. అనంతరం చీపురుపల్లి మండలం రామలింగాపురంలో కలెక్టర్ పర్యటించి, సచివాలయం, ఆర్‌బికె, వెల్‌నెస్ సెంటర్ల భవన నిర్మాణాలను పరిశీలించారు. గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్ధుల చేరికలపై ఆరా తీశారు. వంద శాతం చేరికలు జరగాలని, దీనిపై సచివాలయ సిబ్బంది, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
రీసర్వే ప్రక్రియపై తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. మండలంలోని 32 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియపై గ్రామాలవారీగా ప్రశ్నించారు. ఆశించినంత వేగంగా సర్వే జరగడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని, సర్వేని త్వరగా పూర్తి చేసి, స్టోన్ ప్లాంటేషన్ చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎం.అప్పారావు, తహశీల్దార్లు తాడ్డి గోవింద, ఎం.సురేష్, ఎంపిడిఒలు జి.భాస్కరరావు, కె.రామకృష్ణరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.










