Aug 31,2023 21:20

మున్సిపల్‌ అధికారులు తొలగించిన ఆక్రమణలు ఫైల్‌ ఫొటో

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు ఉదాసీనతగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అక్రమార్కులకు అధికారులు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, పునాదులు నిర్మించి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదులు అందడంతో స్పందించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు స్పందించి జెసిబితో తొలగించారు. తొలగించిన పునాదులను అక్రమార్కులు మళ్లీ నిర్మించారు. అయినా నకిలీ పట్టాల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదని విమర్శలు వస్తున్నాయి.
విఆర్‌ఒ సూత్రధారి!
ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాల వ్యవహారంలో ఓ పంచాయతీ విఆర్‌ఒ సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలిసింది. విఆర్‌ఒ రక్షించేందుకు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఒక విఆర్‌ఒ 10 పట్టాలు తయారు చేసి అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడికి ఇచ్చేందుకు రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు బోగట్టా. విఆర్‌ఒ ఆరు నకిలీ పట్టాలను తయారు చేసి అధికార పార్టీకి చెందిన నేతకు ఇవ్వడంతో పునాదులు నిర్మించారు. నకిలీ పట్టాలతో పునాదులు నిర్మించినట్లు అధికార పార్టీకి చెందిన మరో గ్రూపు ఫిర్యాదు చేయడంతో పునాదులను జెసిబితో కూల్చి వేశారు. నకిలీ పట్టాల వ్యవహారం బయట పడడంతో భయపడిన విఆర్‌ఒ మిగిలిన నాలుగు పట్టాలు ఇవ్వలేదని తెలిసింది. పునాదులు నిర్మించిన వారి దగ్గర ఉన్న నకిలీ పట్టాలను తీసుకుని సంతకాలు ఎవరివి, ఎవరు ఇచ్చారో దర్యాప్తు చేస్తే నకిలీ పట్టాల గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉన్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వాలు మారినా..
ప్రభుత్వాలు మారినా ఇందిరమ్మ కాలనీలో ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు బినామీ పేర్లతో ఇళ్ల పట్టాలు తీసుకుని అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో బినామీ పట్టాలపై చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశించినా ఫలితం కనిపించలేదు. బినామీ పట్టాలపై చర్యలు తీసుకోకుండా టిడిపి హయాంలో కూడా ఖాళీ స్థలాలు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. టిడిపి హయాంలో ఇళ్ల స్థలాలు ఆక్రమణ జరిగినట్లు గుర్తించిన ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్‌, రెవెన్యూ అధికారులతో కమిటీ వేసి ఇళ్ల అక్రమాలపై దర్యాప్తు చేయించారు. ఇళ్ల అక్రమాలపై దర్యాప్తు చేసినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. జాయింట్‌ దర్యాప్తుతో ఆక్రమణలు ఆగుతాయని ప్రజలు ఆశించినప్పటికీ వైసిపి హయాంలో కూడా తామేమీ తక్కువ కాదంటూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఆక్రమణలు, నకిలీ పట్టాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఆక్రమణలు ఆగుతాయని చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఆక్రమణలు, నకిలీ పట్టాలపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నకిలీ పట్టాలపై జాయింట్‌ దర్యాప్తు
ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాల వ్యవహారంపై మున్సిపల్‌ కమిషనర్‌తో చర్చించి రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో జాయింట్‌ కమిటీ ఏర్పాటుచేసి, సమగ్ర దర్యాప్తు చేస్తామని తహశీల్దార్‌ డోల రాజేశ్వరరావు తెలిపారు. నకిలీ పట్టాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. వాటిని గుర్తించేందుకు ఆర్‌ఐని సూపర్‌వైజర్‌గా నియమించి, విఆర్‌ఒలు, మున్సిపల్‌ సిబ్బందితో దర్యాప్తు చేసి, నిగ్గు తేలుస్తామని తెలిపారు. రీసర్వే, ఇతర రెవెన్యూ పనుల వల్ల జాప్యమవుతోందని తెలిపారు.