ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో ఒక నియంతపై పోరాటం చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. సైకో జగన్ ను గద్దె దించే వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. మెకానిక్ టెంపుల్ వద్ద మంగళవారం టిడిపి ఉమ్మడి జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం కుట్రపూరిత దురుద్దేశంతోనే చంద్రబాబుపై వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని, రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించే విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు చంద్రబాబని అన్నారు. వైసిపి అరాచకాలను ఎండగడుతుండటం, ప్రజల్లో రోజురోజుకూ టిడిపి ఆదరణ పెరుగుతుండటం వల్లే.. జగన్ ఈ కుట్ర పన్నారని చెప్పారు. అధినేత చంద్రబాబు నాయుడుకు తామంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు, అనుబంధ విభాగాలతో నిరాహార దీక్షలు చేపట్టనున్నామని వెల్లడించారు. ప్రతీ మండలం నుంచి నాయకులు ఒక్కోరోజు దీక్షలో కూర్చుంటారని చెప్పారు. అధినేతకు అక్రమంగా విధించిన రిమాండ్ పూర్తయ్యే వరకు దీక్షలను కొనసాగిస్తామన్నారు.
రాజకీయ కుట్రతోనే చంద్రబాబు అరెస్ట్
రాజకీయ కుట్రతోనే చంద్రబాబును అరెస్టు చేశారని కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు అన్నారు. మంగళవారం టిడిపి కార్యాలయం బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీరు మాట్లాడారు. చంద్రబాబుపై కేసులు పెట్టినంత మాత్రాన భయపడతారని అనుకుంటే వారి భ్రమ మాత్రమేనని, మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేసి జగన్‌ను గద్దె దించుతామని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో తమ అధినేత చంద్రబాబుకు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. బంద్‌లో స్వచ్ఛందంగా వ్యాపారులు, విద్యాలయాలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. మద్దతు పలికిన జనసైనికులు, సిపిఐ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
బొత్సకు పశ్చాత్తాపం వచ్చిందా?
మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలను నాగార్జున తీవ్రంగా ఖండించారు. టిడిపి నాయకులకు ఇంకా పశ్చాత్తాపం రాలేదని అంటున్న బొత్స.. ఈ మధ్య టివి సీరియళ్లు ఎక్కువగా చూస్తున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ' వోక్స్ వ్యాగన్ ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు వెళ్లిపోయింది. విజయనగరం జిల్లాకు మద్యాన్ని అలవాటు చేసింది మీరు.. మద్యాన్ని ఏరులా పారించి, రేట్లు పెంచి దాని నుంచి లాభాలు సంపాదించారు? సామాన్య కుటుంబాలను నాశనం చేసి డబ్బులు పంచుకున్న మీకు పశ్చాత్తాపం వచ్చిందా?' అని ప్రశ్నించారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, కార్యదర్శి బంగారు బాబు మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కర్రోతు నర్సింగ్ రావు, విజ్జపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










