Aug 31,2023 21:25

విజయనగరంలో నిరసన చేపడుతున్న సిపిఎం నాయకులు, ప్రజలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలో పలుచోట్ల సంతకాల సేకరణ చేపట్టారు. నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని నిరసనలు నిర్వహించారు. నగరంలో ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో 40వ డివిజన్‌ సచివాలయ కార్యదర్శికి సిపిఎం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. సిపిఎం జిల్లా నాయకులు ఎ.జగన్మోహన్‌ మాట్లాడుతూ నిత్యావసర, ఇతర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. పెరిగిన ధరల కారణంగా రెండు పూటలా భోజనం చేసే పరిస్థితుల్లో పేదలు లేరన్నారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రకాశ్‌, ధనలక్ష్మి, సూర్యనారాయణ, విజరు, కళ్యాణ్‌, రమణమ్మ, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
తెర్లాం : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.గోపాలరావు ఆధ్వర్యంలో గురువారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల నాయకులు చింతాడ రామారావు, జి లక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా యువతీ యువకులు, ప్రజలు గురువారం స్థానిక మొయిద కూడలిలో సంతకాల ఉద్యమం చేపట్టారు. సిపిఎం మండల నాయకులు కె.రామారావు మాట్లాడుతూ నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలన చేస్తానని ఎన్నికల్లో ప్రధాని మోడీ వాగ్దానం ఇచ్చి మరిచారన్నారు. కార్యక్రమంలో సిఐటియు నగర పంచాయతీ నాయకులు కె.సూర్యనారాయణమూర్తి, కె.లెనిన్‌ పాల్గొన్నారు.
భోగాపురం : మోడీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గురువారం భోగాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బి. సూర్యనారాయణ మాట్లాడుతూ మోడీ 2014లో అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీని గద్దె దించేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనము రమణ, పిట్ట రామసూరి, మారాడ రవి, రాము, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ మండల కార్యదర్శి మద్దిల రమణ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీనివాస్‌ కాలని, ఆర్‌టిసి కాంప్లెక్స్‌, దేవి కూడలి తదితర ప్రాంతాలలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మద్దిల రమణ మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాదం మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ను ధరలను అదుపు చేయడంలోనూ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చలికాని ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి : సిపిఎం సమరభేరి 2వ రోజు బొబ్బిలి పట్టణంలోని 3, 9 వార్డులో గురువారం నిర్వహించారు. అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరించారు. సిపిఎం నాయకులు పి.శంకరరావు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలను పట్టిపీడిస్తున్న అధిక ధరలు, నిరుద్యోగం, కరెంటు చార్జీలను అదుపు చేయలేని కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం గెద్ద దిగాలని డిమాండ్‌ చేశారు.