ప్రజాశక్తి- శృంగవరపుకోట : నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మోడీ ఆ తర్వాత వారిని మోసగించి రోడ్డున పడేసారని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆరోపించారు. సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిరుద్యోగులతో నిర్వహించిన సదస్సులో తమ్మినేని సూర్యనారాయణ పాల్గొని ప్రసంగించారు. అనంతరం పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విశాఖ అరకు రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాదం మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలోనూ ధరలను అదుపు చేయడంలోనూ ఘోరంగా విఫలమయిందన్నారు. గద్దెనెక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతుందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ ప్రజలపై భారాలు వేసి ఆదాయాలు రాబట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయకపోతే అప్పుకి అనుమతి ఇచ్చేది లేదని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం బెదిరిస్తుందన్నారు. ఈ విధానాలను జగన్ ప్రభుత్వం వ్యతిరేకించకుండా మోడీకి భజన చేస్తూ ఆ విధానాలనే అత్యుత్సాహంగా అమలు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. ప్రభుత్వ రంగాల్లో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అధిక ధరలు అదుపు చేయాలని, కరెంటు చార్జీలు తగ్గించాలని, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, ఎరువులు ధరలు తగ్గించాలని, కౌలు రైతులకు రుణాలు, గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని, కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలు అమలు చేయాలని, పెరిగిన విద్యుత్ చార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలు ట్రాన్స్ పోర్ట్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వీటికి వ్యతిరేకంగా నేడు మండల కేంద్రాల వద్ద ధర్నాలు చేపడతా మన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చినబాబు, రాము, సిపిఎం మండల కార్యదర్శి మద్దిల రమణ, సిపిఎం నాయకుడు ముత్యాలు, అశోక, రమేష్, సవరాల అనీలు, భారతి, సంఘవి ఆమని తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని పెంచుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి. శంకరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రామ్మోహన్ అన్నారు. స్థానిక ఫ్లైఓవర్ వంతెన కింద ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ జనాభాలో 35 సంవత్సరాలు వయసులోపు యువత 65శాతం ఉన్నారనీ ఈ యువతకు ఉద్యోగం ఉపాధి కరువై రోడ్లమీద నిరుద్యోగులుగా తిరుగుతున్నారని గుర్తు చేశారు. సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని మోడీ, స్థానికులకు 75శాతం కంపెనీలో ఉపాధి కల్పిస్తామని జగన్ చెప్పి ఇప్పుడు మాటతప్పారన్నారు. నిరుద్యోగాన్ని పెంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 4 మధ్యాహ్నం రెండు గంటలకు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ సదుస్సులో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మణికుమార్, శివ, డేవిడ్ విద్యార్థులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని సిపిఎం నాయకులు కిల్లంపల్లి రామారావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జ్యూట్ మిల్ గేటు వద్ద మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై రామారావు కార్మికులనుద్దేసించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని దుయ్య బట్టారు. ముఖ్యంగా మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టాక కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయడం వల్ల కార్మిక, వ్యవసాయ, విద్యుత్ రంగాలు దెబ్బతిని ఉపాధి కోల్పోయారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు విరమించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










