Sep 11,2023 21:43

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :  జగనన్నకు చెబుదాంలో వచ్చిన వినతులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వినతుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. అర్జీదారుల కోరిన విధంగా అర్జీ పరిష్కారం అవుతున్నదీ లేనిదీ పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ పరిధిలో వచ్చిన వినతుల పరిష్కారంపై నివేదికలను అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి మంగళవారం ఒక్కో శాఖకు సంబంధించిన కేసులను సమీక్షించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ శాఖల కేసులకు సంబంధించి జిల్లాస్థాయి నోడల్‌ అధికారిగా మైనారిటీ సంక్షేమ అధికారి లావణ్యను నియమించామని చెప్పారు. ముందుగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో కేసులపై సమీక్ష వుంటుం దన్నారు. వినతులు స్వీకరించిన వారిలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ ఎస్‌.డి.అనిత, ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, డిప్యూటీ కలెక్టర్‌ పద్మలత, సూర్యనారాయణ, సుదర్శన దొర ఉన్నారు. వినతుల స్వీకరణ కార్యక్రమానికి 152 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 108, గ్రామ వార్డు సచివాలయం శాఖకు 13, మునిసిపల్‌ శాఖకు 07, గృహనిర్మాణ శాఖకు 8, పంచాయతీరాజ్‌ శాఖకు 10 వినతులు అందాయి.
మిషన్‌ ఇంద్రధనుష్‌లో ప్రతి బిడ్డకూ టీకాలు వేయాలి
మిషన్‌ ఇంద్రధనుష్‌లో టీకాలు వేయకుండా మిగిలిన పిల్లలకు టీకాలు వేసేందుకు ప్రత్యేక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని సెప్టెంబరు 11 నుంచి 16వరకు జిల్లాలో చేపట్టామని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు. మిషన్‌ ఇంద్రధనుష్‌ 5.0 కార్యక్రమంపై కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమీక్షించారు. డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు, ఇమ్యూనైజేషన్‌ అధికారి కుమారి, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ గౌరీశంకర్‌ పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ నియామక పత్రం
విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో భాగంగా బొబ్బిలికి చెందిన బొత్స వీరమాత అనే విభిన్న ప్రతిభావంతురాలికి బి.సి.సంక్షేమశాఖలో ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులో నియమిస్తూ కలెక్టర్‌ నాగలక్ష్మి నియామక పత్రం అందజేశారు.