ప్రజాశక్తి-విజయనగరంకోట : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లా వ్యాప్తంగా శనివారం ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టాయి. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయిలో నిరసనలు చేపట్టాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాయి. రోడ్డుపైకి వచ్చిన టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముందస్తుగా టిడిపి ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేలపై పోలీసులు గృహ నిర్బంధం ప్రయోగించారు.
టిడిపి అధినేత చంద్రబాబును సిఐడి అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న ఆ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకుని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. విజయనగరంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు బంగ్లాకు ఉదయం 5.30 గంటలకు పోలీసులు చేరుకుని, గేట్లు మూసేశారు. అశోక్‌ను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. తెలుగు యువత, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు నగరంలో గురజాడ, అంబేద్కర్, గాంధీ, ఎన్‌టిఆర్ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టారు. ప్రదీప్‌నగర్ కూడల్లో నిరసన తెలిపారు. ద్వారపూడిలో స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ప్రసాదుల కనకమహాలక్ష్మి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పూజలు నిర్వహించారు. ఆందోళన చేసిన టిడిపి నాయకులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, కర్రోతు నర్సింగరావు, పి.మహేష్, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు తదితరులను టూ టౌన్, గంట్యాడ పోలీసుస్టేషన్లకు తరలించారు.
రాజ్యాంగానికి విరుద్ధం
రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతి రాజు ధ్వజమెత్తారు. శనివారం రాత్రి అశోక్ బంగ్లా వద్ద కాగడాలతో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సమాధానం కూడా చెప్పకపోవడం జగన్ రెడ్డి మార్కు పాలనకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసే తీరు ఇదా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో వైసిపి సాధించింది ఏమైనా ఉందా? అంటే ఒక దొంగ ప్రతి వారం సంతకాలు పెట్టేది లేకుండా చేశారంతేనని వ్యాఖ్యానించారు. నిర్బంధాలు అరెస్టులతో ఏమీ సాధించలేరన్నారు. తెల్లదొరల దగ్గరే భయపడలేదని, వీరి వద్ద ఎందుకు భయపడాలని మండిపడ్డారు. వైసిపి సర్కారును ఎంత త్వరగా ఇంటికి పంపిస్తే రాష్ట్రానికి అంత మంచిదన్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే
లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు బాబ్జీ
విజయనగరంకోట : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి.బాబ్జీ తెలిపారు. శనివారం విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సిఐడిని అడ్డుపెట్టుకుని అరెస్టు చేసిన తీరు ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘ నేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని మరో బీహార్‌లా తయారు చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని సిఎం జగన్ భావిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది జరగని పనని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.
అరెస్ట్ తీరు అప్రజాస్వామికం
జనసేన నేత గురాన అయ్యలు
విజయనగరం టౌన్ : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ తీరు అప్రజాస్వామికమని జనసేన నేత గురాన అయ్యలు ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల కూడా అలాగే ప్రవర్తించారని, ఏ తప్పూ చెయ్యని జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారని చెప్పారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే సిఎం జగన్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని స్పష్టంచేశారు.
ప్రజల సొమ్ము కాజేసినందుకే..
వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం టౌన్ : ప్రజల సొమ్ము కాజేసిన కేసులోనే చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసినట్లు వైసిపి జిల్లా అధ్యక్షులు, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం స్థానిక జెడ్‌పి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కదోవ పట్టించేలా టిడిపి నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. స్కీమ్ పేరుతో స్కామ్ చేశారని ఆరోపించారు. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదని, దాదాపు రెండేళ్ల కిందటే ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు నమోదు అయ్యిందని చెప్పారు. 2017-18లోనే జిఎస్‌టి డిఐజి నేతృత్వంలోని బృందం రూ.241 కోట్లు దారిమళ్లినట్టు బయటపెట్టిందని, ఎఫ్‌ఐఆర్ కంటే ముందే జిఎస్‌టి నిఘాలో స్కామ్ బయటపడిందని తెలిపారు. ఎటువంటి కంపెనీలు లేకుండా రూ.371 కోట్లు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. ఆరోపణలున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం సాధారణమని, రెండేళ్లుగా సాగుతున్న దర్యాప్తు కేసులో ఇప్పుడు కూడా చంద్రబాబును ప్రశ్నించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఎల్లప్పుడూ 'నిప్పు.. పప్పు' అని చెప్పుకుంటున్న చంద్రబాబు నిజాయతీని నిరూపించుకోవాలని హితవుపలికారు. సమావేశంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.
తప్పు చేస్తే శిక్ష తప్పదు
డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం టౌన్ : ఎంతటివారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని, ఎటువంటి తప్పూ చేయకుంటే చంద్రబాబు తన నిజాయతీని నిరూపించుకోవాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎటువంటి కంపెనీ లేకుండా రూ.377 కోట్ల అవినీతి జరిగిందని సిఐడి నిరూపించిందన్నారు. అందుకే చంద్రబాబును అరెస్టు చేశారని, అంతేతప్ప రాజకీయ కక్ష సాధింపు కాదని తెగేసిచెప్పారు. దీనికి ఎటువంటి రాజకీయాలు ఆపాదించవద్దని మిగిలిన రాజకీయ పార్టీలకు సూచించారు. ఇంతవరకు చంద్రబాబు మాయమాటలతో చేసిన తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇందులో సూత్రదారులుగా ఉన్న అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడును కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చంద్రబాబు ప్రస్తుతం అనేక కేసుల్లో స్టే మీద ఉన్నారని అవన్నీ ఎత్తేస్తే మళ్లీ అరెస్టులు తప్పవన్నారు.










