ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ప్రజలకు అత్యంత నిరాశ, నిస్ఫృహలకు గురిచేసింది. ప్రత్యేకించి వైసిపి కార్యకర్తలకు ఏమంతగా రుచించలేదు. పాత విషయాలే చెప్పారని, స్థానిక సమస్యలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే మంత్రులకు అవకాశం ఇవ్వలేదని సభకు వచ్చిన ఎక్కువ మంది నోట వినిపించింది. మరోవైపు ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా, ప్రభుత్వంలో అత్యంత కీలకంగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై చాలా మంది వైసిపి నాయకులు, క్రియాశీలక కార్యకర్తల్లో నైరాశ్యం కనిపించింది. కేంద్రీయ గిరిజన యూనివర్శిటీ శంకుస్థాపన సందర్భంగా దత్తిరాజేరు మండలం మరడాం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రంగాలకు చెందిన చైర్మన్లు హాజరైనప్పటికీ, కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కూడా వేదికపై అవకాశం కల్పించలేదు. స్థానిక ఎమ్మెల్యే అప్పలనర్సయ్యను కూడా వేదికపైకి ఆహ్వానించకపోవడంతో తమ సమస్యలు విన్నవించుకునేందుకు అవకాశం లేకపోయిందంటూ గజపతినగరం నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వైసిపిలో పవర్ ఫుల్ లీడర్‌గా వున్న మంత్రి బొత్సకు కూడా మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడం పట్ల చాలా మంది నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యాశాఖ మంత్రి హోదాలోనైనా ఆయనకు అవకాశం కల్పించాల్సివుందని, సిఎం ఉద్దేశపూర్వకంగానే అవకాశం ఇవ్వలేదని కొంతమంది నోట వినిపించింది. జిల్లా, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోయినా, సాలూరు, గజపతినగరం నియోజకవర్గాలకు అవసరమైన అభివృద్ధి పనులు లేదా సమస్యల పరిష్కారం విషయమైనా సిఎం మాట్లాడలేదు. వాస్తవానికి గుర్ల గెడ్డ జలాశయం 25ఏళ్లగా పెండింగ్‌లో ఉంది. కేవలం రూ.16కోట్లు ఖర్చుచేస్తే సుమారు 3వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తోటపల్లి నుంచి వచ్చే గజపతినగరం బ్రాంచి కెనాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దత్తిరాజేరు మండలంలో చాలా వరకు సాగునీటి అవకాశం లేక ఎక్కువగా కరువు కాటకాలతో అల్లాడుతోంది. అందుకే ఇక్కడి నుంచి వలసలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మానాపురం రైల్వే వంతెన పనులు రెండు దశాబ్ధకాలంగా నిలిచిపోయాయి. ముఖ్యంగా కొఠియా గ్రామాల ప్రజలకు మన రాష్ట్రం తరపున పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదనే ప్రచారం ఒడిశా ప్రభుత్వం చేస్తోంది. సాలూరు పట్టణంలో రహదారుల విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. ఇవన్నీ చిన్నచిన్న సమస్యలే అయినా స్థానికులకు పెద్ద ఆటకంగాను, అవరోధంగాను ఉన్నాయి. వీటి గురించి చెప్పుకునేందుకు ఎలాగూ అవకాశం కల్పించలేదు సరికదా కనీసం ముందస్తుగా తెలుసుకుని, వాటిపై హామీలైనా ఇవ్వలేదని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులను విస్మరించి, సమస్యలను ప్రస్తావించకుండా పాలన సాగిస్తే వచ్చే ఎన్నికల్లో కష్టమేనని కూడా రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. గిరిజనుల ఉద్దరణకు ఏర్పాటు చేస్తున్నామంటున్న గిరిజన యూనివర్శిటీ శంకుస్థాపన సభలో గిరిజనులను భాగస్వామ్యం చేయలేకపోయారు. ఇందుకు సభ విజయనగరం జిల్లాలో జరపడం ఒక కారణమైతే, పార్వతీపురం మన్యం జిల్లా అధికార యంత్రాంగాన్ని నామమాత్రంగానే భాగస్వామ్యం చేయకపోవడం రెండో కారణంగా చెప్పుకోవచ్చు. చివరకు గిరిజన శాఖ మంత్రి రాజన్నదొరను సభాధ్యక్షుడిగా ప్రకటిస్తూనే ఆ స్థానానికి దూరం చేస్తూ స్థానికేతర వ్యాఖ్యాత అన్నీ తానై వ్యవహరించారు. రాజకీయ ప్రత్యర్థులపై స్పందించకపోవడం పట్ల కూడా వైసిపి కేడర్‌లో చర్చనడిచింది. రాజన్నదొర మాట్లాడుతుండగా సిఎం సభ ఏర్పాట్ల సమన్వయ కర్త తలశిల రఘురాం ప్రసంగం ముగించాలంటూ ఆదేశాలివ్వడంతో సభికులు నివ్వెర బోయారు.










