Sep 09,2023 21:20

కాంప్లెక్సులో బస్సుల కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జిల్లాలో ఆర్‌టిసి బస్సులు విజయనగరం డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇవ్వకుండా శనివారం బస్సులు నిలిపివేస్తున్నట్లు తెలపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం తెల్లవారుజామున యథావిధిగా ఉద్యోగులు విధులకు రావడంతో ఉదయం నాలుగు గంటలకు వైజాగ్‌ వెళ్లే బస్సు ఒకటి బయల్దేరింది. అరగంట తర్వాత ఆర్‌టిసి అధికారులకు సమాచారం రావడంతో అక్కడి నుంచి బస్సులు నిలిపేశారు. దీంతో ఆర్‌టిసి కాంప్లెక్సుకు వచ్చిన ప్రయాణికులు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదే అదునుగా ప్రయివేటు వాహనదారులు కొందరు రెట్టింపు ఛార్జీలు వసూలు చేశారు. ఉదయం 10.30 గంటల తరువాత డిపో నుంచి బస్సులు బయటకొచ్చాయి. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.