
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 'అధ్యక్షా! నగరంలో సుందరీకరణ పేరుతో జరుగుతున్న పనులు ఒట్టి బూటకం. నగరంలో ప్రేమ సమాజం వద్ద ఉన్న గోతుల రోడ్డు, సిఎంఆర్ జంక్షన్ వద్ద తాగునీటి పైపు లీకేజీ, వైఎస్‌ఆర్ నగర్ మెడికల్ కాలేజీకి వెళ్లే రోడ్డు దుస్తితి చూడండి. వాటికి అధికారులు సమాధానం చెప్పాలి' అంటూ టిడిపి 49వ డివిజన్ కార్పొరేటర్ కర్రోతు రాధారాణి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేశారు. వెంటనే లేచిన అధికార పార్టీ నామినేటెడ్ సభ్యులు ఆశపు వేణు, కార్పొరేటర్లు ఎస్‌వివి రాజేష్, బండారు ఆనంద్, కంటుభుక్త తవిటిరాజు, అల్లు చాణక్య,మరో ఇద్దరు మహిళా వైసిపి కార్పొరేటర్లు మూక్మమడిగా టిడిపి కార్పొరేటర్ పై మాటలు దాడి చేశారు. మీ అహయంలో ప్రభుత్వ ఆస్తులు అమ్ముకొని అశోక్ గజపతిరాజు ఇంటికి రంగులు వేసుకుంటే మా కోలగట్ల వీరభద్రస్వామి హయాంలో నగరంలో అభివృద్ధి జరుగుతుందని, అందుకు ఉదాహరణ 49వ డివిజన్‌కు రూ.50 లక్షలతో పనులకు శ్రీకారం చుట్టడమేనని అన్నారు. తాను అధికారుల నుంచి, మేయర్ నుంచి సమాధానం అడిగితే మీరు ఎందుకు చెబుతున్నారంటూ పట్టు పట్టి మేయర్ కుర్చీ వద్దకు వచ్చి నిల్చున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లు మాటలు దాడి, అధికారులు నుంచి సమాధానం రాకపోవడంతో టిడిపి కార్పొరేటర్ కర్రోతు రాధారాణి సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.
మేయర్ వి.విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎజెండాపై చర్చ జరుగుతున్నప్పుడు టిడిపి కార్పొరేటర్ రాధారాణి నగరంలో పలు ప్రాంతాల్లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, కాలువలు, నగరంలో తాగు నీటి పైపులైన్లు లీకేజీలపై ఫోటోలతో పాటు కౌన్సిల్ సమావేశంలో ఉంచే ప్రయత్నం చేశారు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లు, నామినేటెడ్ సభ్యులు వైసిపి పాలన కాలంలో చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అశోక్ బంగ్లాలో రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను మీరు చదవడం ఎన్నికల లబ్ధి కోసం తప్ప మరొకటి కాదన్నారు. అశోక్ గజపతిరాజు నగరాభివృద్ధికి ఏమి చేశారో చెప్పాలన్నారు. నేడు రోడ్లు కాలువలు, వీధి లైట్లు, తాగు నీరు సరఫరా, జంక్షన్‌ల అభివృద్ధి చేస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టిడిపి కార్పొరేటర్ స్పందిస్తూ నేడు నగరానికి తాగునీటి పథకం తెచ్చి నీరు ఇచ్చిన ఘనత అశోక్ గజపతిరాజుది అన్నారు. సమాధానం చెప్పకుండా కౌన్సిల్ సమావేశంలో తర్వాత ఎజెండా లో కి వెళ్లడంతో రాధారాణి సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం జరిగిన సాధారణ సమావేశంలో ఎజెండా లో 22 అంశాల్లో 20 అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. రెండు అంశాలను వాయిదా వేశారు. తర్వాత జరిగిన అత్యవసర సమావేశం లో కూడా ఎజెండాలోని 9 అంశాలకు 7 అంశాలు ఆమోదించి రెండు అంశాలు వాయిదా వేశారు.
ఎజెండా రూప కల్పనపై మండి పడ్డ కార్పొరేటర్ రాజేష్
మరో వైపు ఎజెండాలోని అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు వాటర్ వర్క్స్‌పై పెట్టిన అంశంపై స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ వి వి రాజేష్ మండి పడ్డారు. ఎజెండా రూపొందించే విధానం ఇది కాదని, అర్థం కాని, కొత్త పదాలు ఉపయోగించి ఎజెండా తయారు చేయడం సరికాదన్నారు.కౌన్సిల్ సమావేసానికి వారం రోజులు ముందు ఎజెండా ఇవ్వాలని, కేవలం మూడు రోజులు ముందు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పద్దతి మార్చుకోవాలని సూచించారు.
నగరాభివృద్ధే ధ్యేయంగా కషి : మేయర్
నగర అభివద్ధే ధ్యేయంగా తాము చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగరంలో ప్రధాన రహదారులు అభివృద్ధి చేస్తున్నామని, పెద్ద చెరువు గట్టును సుందరీకరిస్తున్నామని అన్నారు. పైడితల్లమ్మ జాతర సమయాని కల్లా ప్రధాన రహదారుల పనులు పూర్తి కావాలని అధికారులకు సూచించామన్నారు. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా గుర్తించిన పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పారు. పనులు కూడా త్వరగా పూర్తయ్యే విధంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కమిషనర్ శ్రీరాములు నాయుడు, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, ఎసిపి మధుసూదనరావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.










