ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలో జగనన్న శాశ్వత భుహక్కు, భూ రక్షణ అమలు ప్రక్రియలో భాగంగా రీ సర్వే ప్రారంభమైంది. సోమవారం 14వ డివిజన్ 17 వ నెంబర్ సచివాలయ పరిధిలో రీ సర్వే కార్యక్రమానికి మేయర్ విజయలక్ష్మి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా చేపడుతున్న రీ సర్వే ప్రక్రియ పట్ల ప్రజలు అపోహలు వీడి అధికారులకు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో ఎటువంటి భూ తగాదాలు, ఇబ్బందులు లేకుండా సంపూర్ణ హక్కులతో ఆన్‌లైన్ విధానంలో అనుసంధానం చేసి ఆస్తిదారులకు భూహక్కు పత్రాలను అందించడమే ఈ పథకం ఉద్దేశమని అన్నారు. కమిషనర్ ఆర్. శ్రీ రాములనాయుడు మాట్లాడుతూ 52 చదరపు కిలోమీటర్లు మేర నగర పరిధి వ్యాపించి ఉందన్నారు. రీ సర్వే వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, భూ యజమానులు పూర్తిగా సహకరించి తమ వద్దకు వచ్చే సిబ్బందికి ఆస్తి వివరాలను అందించాలని చెప్పారు. ప్రజల వద్దకు వచ్చే సిబ్బందికి ఆస్తి వివరాలను అందించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎసిపి అమ్మాజి, డిప్యూటీ మేయర్ లయా యాదవ్, ఫ్లోర్ లీడర్ ఎస్‌వివి రాజేష్, కార్పొరేటర్లు మారోజు శ్రీనివాసరావు, దాసరి సత్యవతి, కనకాల నాగవల్లి, మీసాల రమాదేవి అమ్మాజీ రావు, సర్వేయర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
రేషన్ కార్డులు పంపిణీ చేసిన మేయర్ విజయలక్ష్మి
14వ డివిజన్ పరిధిలో నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డులను మేయర్ విజయలక్ష్మి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫ్లోర్‌లీడర్ ఎస్‌వివి రాజేష్ మాట్లాడుతూ అర్హత ఉండి తెల్ల రేషన్ కార్డు పొందలేని వారి వివరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి వారికి మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.










