Sep 03,2023 22:18

విజయనగరం నగరంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా మెరుగైన పారిశుధ్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి కొండపల్లి సాంబమూర్తి తెలిపారు. మెరుగైన సేవలకు నగర ప్రజలు సహకరించాలని కోరారు. ఈ వారం తనను కలిసిన 'ప్రజాశక్తి'కి ఆయన ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవల గురించి వివరించారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు...
- ప్రజాశక్తి, విజయనగరం టౌన్‌: 

పెరుగుతున్న నగర విస్తీర్ణం రీత్యా ఎంతమంది కార్మికులు అవసరం, ఉన్న వారి సంఖ్య ఎంత?.
ప్రస్తుతం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో పర్మినెంట్‌ కార్మికులు195 మంది, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు 456 మంది ఉన్నారు. వాస్తవానికి 700 ఇళ్లకు ఐదుగురు కార్మికులు ఉండాలి. దీని ప్రకారం మరో 147 మంది అవసరం. పాలకవర్గం అనుమతితో అదనంగా 70 మందిని తీసుకున్నాం. ఉన్న కార్మికులను పని విభజన చేసి, సచివాలయానికి 10 మంది కార్మికులతో పనులు చేయిస్తున్నాం. అదనంగా తీసుకున్న 70 మంది కార్మికుల్లో 30 మంది ప్రత్యేకంగా రాత్రివేళ ప్రధాన రహదారుల్లో పారిశుధ్య పనులు చేస్తున్నారు.
నగరంలో చెత్త సేకరణ ఎలా సాగుతోంది?.
నగరంలో 53 క్లాప్‌ వాహనాలు, నగర పాలక సంస్థ దగ్గర ఉన్న 41 వాహనాలతో చెత్త తరలిస్తున్నాం. రోజుకు 120 టన్నుల చెత్త సేకరిస్తున్నాం. ఇందులో 100 టన్నుల వరకు చెత్తను విశాఖలో ఉన్న జిందాల్‌ పరిశ్రమ వారు ప్రతిరోజూ తీసుకెళ్తున్నారు. మిగతా 20 టన్నుల వరకు డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నాం.
యూజర్‌ ఛార్జీల వసూలు ఎలా ఉంది?.
చెత్తను తరలించేందుకు స్వచంద్ర కార్పొరేషన్‌ ద్వారా నగరంలో ఉన్న 53 వాహనాలకు అయ్యే ఖర్చును యూజర్‌ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారు. వాస్తవానికి వాహనాలకు ప్రతి నెలా 40 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. కానీ యూజర్‌ ఛార్జీలు రూ.20 లక్షల నుంచి 25 లక్షల వరకు మాత్రమే వసూలు అవుతున్నాయి. మిగిలిన మొత్తాన్ని కార్పొరేషన్‌ నుంచి చెల్లిస్తున్నాం. నగర ప్రజలు యూజర్‌ ఛార్జీలు చెల్లించి నగర పాలక సంస్థకు సహకరించాలి.
దోమల నివారణకు తీసుకున్న చర్యలేమిటి?.
వర్షాకాలం కావడంతో దోమల నివారణకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే రెండు ఫాగింగ్‌ మిషన్లు, 40 చేతి స్ప్రే మిషన్లు ద్వారా స్ప్రే చేయిస్తున్నాం. 600 లీటర్ల వరకు లిక్విడ్‌ అందుబాటులో ఉంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో, చెరువుల్లో ఆయిల్‌ బాల్స్‌ వేస్తున్నాం. ప్రతి సచివాలయ పరిధిలో 5 స్ప్రే మిషన్లు ద్వారా స్ప్రేయింగ్‌ చేయిస్తున్నాం. నగర ప్రజలు కాలువల్లో చెత్త వేయకుండా, మురుగునీరు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ట్రేడ్‌ లైసెన్స్‌ ద్వారా కార్పొరేషన్‌కు వస్తున్న ఆదాయం ఎంత? దీన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?.
నగరంలో ట్రేడ్‌ లైసెన్స్‌ ఉన్న షాపులు 1800 వరకు నమోదయ్యాయి. వీటిలో డబుల్‌ ఎంట్రీ కలిగిన షాపులు ఉన్నాయ. వాటిని తీసేస్తే 1200 షాపుల నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు ఏటా రూ.26 లక్షల వరకు వసూలవుతోంది. ఆదాయం పెంచేందుకు నగరంలో ఉన్న అన్ని షాపులను సర్వే చేసి, ట్రేడ్‌ లైసెన్స్‌ పరిధిలోకి తీసుకొస్తాం. కేవలం ఆధార్‌ కార్డు ఉంటే ట్రేడ్‌ లైసెన్స్‌ ఇవ్వనున్నారు.
ప్లాస్టిక్‌ నియంత్రణ అమలుకు చేపట్టిన చర్యలేమిటి?.
ప్లాస్టిక్‌ నియంత్రణకు నగర ప్రజలు, వ్యాపారులు సహకరించాలి. ఇప్పటికే అనేక షాపుల్లో తనిఖీలు చేశాం. కొన్ని షాపులకు అపరాధ రుసుం కూడా విధించాం. దీనికోసం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో 6 బృందాలు పర్యవేక్షణ చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ నియంత్రణను పాటించి పర్యావరణాన్ని కాపాడటంతోపాటు ప్లాస్టిక్‌ రహిత నగరంగా విజయనగరం నిలిచేలా సహకరించాలి.
మెరుగైన పారిశుధ్యం అమలు కోసం ప్రజలకిచ్చే సందేశం ఏమిటి?.
వర్షాకాలం కావడంతో కాలువల్లో చెత్త వేయకుండా, నగర పాలక సంస్థ వాహనాలకు అందించాలి. ప్రతి ఇంటి ముందుకు కార్మికులు, వాహనాలు వస్తున్నందున బయట చెత్త వేయకుండా కార్మికులకు అందివ్వాలి. కాలువల్లో చెత్త వేయకుండా సహకరించాలి. ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలి. నగరంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పారిశుధ్య నిర్వహణలో కార్మికులకు సహకరించాలి.