Aug 29,2023 21:51

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం : నాడు - నేడు రెండో దశలో భాగంగా జిల్లాలో చేపట్టిన పనుల్లో మేజర్‌, మైనర్‌ మరమ్మతులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి విద్యా, ఇంజనీరింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, కెజిబివిలు, అంగన్‌ వాడీల్లో జరుగుతున్న నాడు - నేడు రెండో దశ పనులపై కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గుర్తించిన 731 పనుల ప్రస్తుత స్థితిపై కలెక్టర్‌ ఆరా తీశారు. 211 చోట్ల అదనపు తరగతి భవనాలకు అనుమతులు ఇచ్చినా ఇంకా కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాకపోవటంపై కలెక్టర్‌ విచారం వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముందుగా డిఇఒ బి. లింగేశ్వరరెడ్డి పనుల నివేదికను వెల్లడించారు. జిల్లాలో జూనియర్‌ కళాశాలలు, పాఠశాలలు, అంగన్‌ వాడీల్లో 731 చోట్ల పనులు చేపట్టామని, అవన్నీ చివరి దశలో ఉన్నాయని వివరించారు.కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ నాడు-నేడు రెండో దశ పనుల్లో మరమ్మతులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, మరుగుదొడ్లు, కిచెన్‌ షెడ్లు నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు తరగతి భవనాలకు సంబంధించిన పనులను సెప్టెంబర్‌ 15వ తేదీ లోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. జరుగుతున్న పనుల తాలూక నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని సూచించారు. విడుదల చేసిన నిధులను సమృద్ధిగా వినియోగించాలని చెప్పారు. ఒకవేళ ఎక్కడైనా అదనపు తరగతి భవనం అవసరం లేకపోతే తదుపరి చర్యల నిమిత్తం డిఇఒ ద్వారా తనకు తెలియజేయాలని కలెక్టర్‌ సూచించారు. సివిల్‌ వర్కులు పూర్తయిన చోట ఫర్నీచర్‌ వర్కులు వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న కొన్ని సమస్యలను ఎంఇఒలు, ఇంజినీరింగ్‌ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకు రాగా సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఎస్‌ఎ ఇఇ ఎం.శ్రీనివాసకుమార్‌, ఎంఇఒలు, హెచ్‌ఎంలు, డిఇలు, ఎఇలు, ఐసిడిఎస్‌ సిడిపిఒలు పాల్గొన్నారు.