ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఈనెల 15న ప్రారంభ ముహర్తం ఖరారు కావడంతో మెడికల్ కళాశాల ముస్తాబవుతోంది. అడ్మినిస్ట్రేటివ్ విభాగంతోపాటు ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం బోధనకు అవసరమైన అన్ని గదులనూ ఇప్పటికే సిద్ధం చేశారు. అధునాతన మౌలిక సదుపాయాలతోపాటు తరగతులకు అవసరమైన ఫర్నీచర్ కొద్దిరోజుల క్రితమే అమర్చారు. భవన సముదాయానికి ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుతున్నారు. కొద్దిరోజులుగా రాత్రి పగలు అనే తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితమే కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ సర్వజన ఆసుపత్రి నుంచి మెడికల్ కళాశాలలోకి మారిన విషయం విధితమే. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థుల కౌన్సిలింగ్ ముగిసింది. తరగతులు కూడా ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈనేపథ్యంలో భవన సముదాయాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈనెల 15న రానున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ హడావుడి లేదని సమాచారం. ఆ రోజు విశాఖ నుంచి హెలీక్యాఫ్టర్‌లో జెఎన్‌టియు ఇంజినీరింగ్ యూనివర్శిటీకి సమీపంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మెడికల్ కాలేజీకి చేరుకుని భవన సముదాయానికి చేరుకుంటారు. మార్గం మధ్యలో పలు చోట్ల పరిమితమైన జనం స్వాగతం పలికేందుకు అవకాశం కల్పించాలని జిల్లా మంత్రి, అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం రోడ్డుకు ఇరువైపులావున్న జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు నిర్ణయించారు. తొలుత మెడికల్ కాలేజీ సముదాయంలో ఏర్పాటుచేసిన కీర్తిశేషులు వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కళాశాలలో స్కిల్ ల్యాబ్, అటానమీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లను కూడా సందర్శించనున్నారు. అనంతరం ఇక్కడి నుంచి విజయనగరంతోపాటు రాష్ట్రంలోని రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు వైద్య కళాశాలలను కూడా ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఆ తరువాత లెక్చర్ హాల్‌లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖి అవుతారు. జిల్లాకు చెందిన మంత్రితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రమే సిఎం కార్యక్రమంలోకి అనుమతిస్తారు. లెక్చర్ హాల్‌లో పరిమితమైన సీట్లు ఉండడంతో మిగిలినవారి పక్కన హాల్‌లో కూర్చొనేందుకు అవకాశం కల్పిస్తారు. మీడియాను కూడా ఒక ప్రత్యేక గదిలోకి అనుమతించి అక్కడి నుంచే కవరేజీ చేసుకునే ఏర్పాట్లు చేయనున్నట్టు సమాచారం. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో సిఎం భద్రతను దృష్టిలోవుంచుకుని బహిరంగ సభ లేకుండా ఇండోర్ కార్యక్రమంతో సరిపెడుతున్నట్టుగా చర్చ నడుస్తోంది.










