Aug 23,2023 21:15

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రులు రాజన్నదొర, ముత్యాల నాయుడు

ప్రజాశక్తి-దత్తిరాజేరు, మెంటాడ :  ఈనెల 25న కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేసేందుకు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తో కలిసి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో, పర్యటన ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్‌పి దీపిక, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి బుధవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. మరడాం లోని సభా ప్రాంగణం, హెలిపాడ్‌, చిన మేడపల్లి వద్ద శంకుస్థాపన జరిగే ప్రాంతాలను తనిఖీ చేశారు. అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. సభకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా విఐపిలు, ఇతరుల వాహనాలు పార్కింగ్‌ ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేయాలన్నారు. హెలిపాడ్‌ వద్ద ముఖ్యులు వేచి ఉండటానికి అనువుగా టెంట్లు ఏర్పాట్లు చేయాలని, హెలిపాడ్‌ నుంచి శంకుస్తాపన ప్రాంతానికి వెళ్లి వచ్చే మార్గంలో వాహనాలను నియంత్రించాలని సూచించారు. కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, పార్వతీపురం ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.