ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. కాళ్లు ఆరిగేలా తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ అర్జీదారులు, ఫిర్యాదు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందన పేరును 'జగనన్నకు చెబుదాం' అంటూ చేసిన మార్పు పొయ్యిమీద నుంచి పెనం మీదకు వెళ్లినట్టుగానే ఉందని, ఇటువంటి మార్పుల వల్ల తమకు ఒరిగిందేమీ లేదని చెబుతున్నారు. దీంతో, ఫిర్యాదులపై సకాలంలో స్పందించి, పరిష్కారం చూపడంలోనూ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నట్టుగా కలెక్టర్ తరపున వస్తున్న ప్రకటనలు ఉత్తుత్తివేనని స్పష్టమౌతోంది. ఈ నేపథ్యంలో మచ్చుకు కొంతమంది బాధితుల ఆవేదన, ఆక్రోశం పరిశీలిస్తే....
వేపాడ మండలం బక్కునాయుడిపేట బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహం ప్రాంగణంలో దట్టమైన ముళ్లపొదలు, తుప్పలు, రాళ్లగుట్టలతో ఉండడం వల్ల నిత్యం విష సర్పాలు తారసపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి అపాయం జరుగుతుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వసతిగృహం సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తప్పులు డొంకలను తొలగించాలంటూ ఓ సామాజిక కార్యకర్త స్థానిక ప్రజలతో కలిసి జగనన్నకు చెబుదాంలో జులైలో ఒకసారి, ఆగస్టు మరోసారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తొలిసారి కలసినప్పుడు తక్షణం పరిష్కరిస్తామంటూ కలెక్టర్ నాగలక్ష్మి హామీ ఇచ్చారు. రెండోసారి మూడు రోజుల్లో పరిష్కారం చేయకపోతే, స్థానిక ఎంపిడిఒపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా పరిషత్ సిఇఒను ఆదేశించారు. ఇప్పటికీ అధికారులు ఆ స్కూలు వైపు కన్నెత్తి చూడలేదు. పైగా జులై 24న పనిచేసినట్టు ఎంపిడిఒ తప్పుడు నివేదిక కూడా ఇచ్చారు. ఈనేపథ్యంఓ స్థానిక ప్రజల సహకారంతో ఆ సామాజిక కార్యకర్తే కొంత భాగంలో తుప్పలు, డొంకలను తొలగించారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు తెలియజేసేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లినప్పటికీ, వీడియో కాన్ఫెÛరెన్స్‌లో ఉండడంతో వెనుదిరిగారు. సంక్షేమ వసతిగృహంలో ప్రమాదకరంగాను, ప్రాణాంతంకగా ఉన్న తుప్పలను తొలగించేందుకు రెండు నెలలు సమయం అవసరమా? అంటూ కొందరు... కలెక్టర్ ఆదేశించడం తప్ప, అమలు చేసేందుకు ప్రయత్నించడం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఉదాసీనతతో స్థానిక ప్రజలు తొలగించిన తుప్పలు, డొంకల పనికి బిల్లుపెట్టుకునేందుకు కూడా అధికారులు, రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానిక ప్రజానీకం విమర్శిస్తున్నారు. ఇదే మండలంలోని గుడివాడవాని చెరువులో జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన విషయమై జగనన్నకు చెబుదాంలో నేరుగా కలెక్టర్‌కు జులై 17న ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదు. దీంతో, బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో నిర్మాణాలు వెంటనే ఆపాలంటూ సాక్షాత్తు కలెక్టర్‌కే ఈనెల 22న ఉత్తర్వులు జారీచేసింది. దీంతో, కోర్టుకు ఉన్న శ్రద్ధ, కలెక్టర్‌కు, సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులకు లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూసపాటిరేగ మండలం కొప్పెర గ్రామానికి చెందిన పార్వతి సమీపంలోని బయోటెక్‌లో కంపెనీలో ఉద్యోగం చేసేవారు. లైంగిక వేధింపులకు పాల్పడిన హెచ్‌ఆర్‌పై పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో కంపెనీ యాజమాన్యం పార్వతిని ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉంది. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ కలెక్టర్ నాగలక్ష్మిని ఇప్పటి వరకు మూడు సార్లు కలిసినా ప్రయోజనం లేకపోయిందని పార్వతితో పాటు సిఐటియు నాయకులు ప్రజాశక్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తొలిసారిగా కలిసినప్పుడే కార్మికశాఖ అధికారులతో మాట్లాడి, ఉద్యోగం తప్పక ఇప్పిస్తామని చెప్పినప్పటికీ, ఇప్పుడు దాటవేస్తున్నారని ఐద్వా నాయకులు చెబుతున్నారు.
విజయనగరం పట్టణంలోని 1వ డివిజన్ అప్పయ్యప్ప నగర్‌లో సర్వే నెంబర్ 136 ప్రభుత్వానికి చెందిన గెడ్డ ఆక్రమించి, అనుమతులు లేకుండా కమర్షియల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు అధికారులే తేల్చారు. ఈ ప్లాంటువల్ల తమ ఇళ్లల్లోని బోర్లు ఇంకిపోతున్నాయంటూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన సుమారు 120 కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. వీరి సంతకాలతో కూడిన వినతిపత్రాలను జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో నేరుగా కలెక్టర్, జెసిలకు 9 సార్లు అందజేశారు. ఇందులో ఏడు సార్లు జగనన్నకు చెబుదాంలో రికార్డులో నమోదైంది. ఒకసారి జెసి, మరోసారి కలెక్టర్ వెంటనే సీజ్ చేయాలని కూడా విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ శ్రీరాములు నాయుడును ఆదేశించారు. అయినా అమలుకు నోచుకోలేదు. దీంతో, ఆ కాలనీకి చెందిన రవికుమార్‌తోపాటు పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరావు, స్థానిక ప్రజలు సోమవారం మరోసారి కలెక్టర్‌కు వచ్చారు. ఇలా ఒకరూ... ఇద్దరు కాదు... వ్యక్తిగత సమస్యలపై కొందరు, సామాజిక సమస్యలపై మరికొందరు కలెక్టరేట్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించడం లేదు సరికదా, సంతృప్తిగా వున్నారా? అన్న ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది తమ వద్దకు రావడం ఒకింత అసహనానికి గురిచేస్తోందని చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలు అమలు చేయని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజాశక్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










