ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తండ్రి లేడు.. ఉద్యోగం లేదు.. అన్నకు పెళ్లి కాలేదన్న మనస్థాపంతో పల్లి వాసు (30) బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్న ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామానికి చెందిన వాసు కొంతకాలం క్రితం వరకు ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసేవాడు. ఉద్యోగం చేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవడం కష్టంగా ఉందని 9 నెలల క్రితం ఉద్యోగాన్ని వదిలి పద్మావతి నగర్ లో ఉంటున్న తన అన్నయ్య సంతోష్ వద్దకు వచ్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే తాను గర్భంలో ఉండగా తండ్రి పోయాడని, తన అన్న సంతోష్‌కు ఉద్యోగం లేక పుస్తకాల వ్యాపారం చేయడం వలన వివాహం కాలేదని, తాను కూడా మంచి ఉద్యోగం సంపాదించలేకపోతున్నాను అని మనస్థాపంతో ఇంట్లోని పూజా గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పుస్తకాలు వ్యాపారం చేసుకునే సంతోష్ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 10:30 గంటల సమయం అయిన తమ్ముడు రాలేదని భావించి ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంట్లో ఉన్నాడేమోనని చూశాడు. పూజాగది తలుపు వేసి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు విరగగొట్టి చూడగా ఉరి వేసుకుని ఉన్నాడు. ఫిర్యాదు మేరకు వన్ టౌన్ ఎస్‌ఐ అశోక్ కుమార్ సంఘటన స్థలం చేరుకొని పరిశీలించారు.










