Sep 07,2023 20:59

బొబ్బిలి: సర్టిఫికేట్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శంబంగి, ఎంపి బెల్లాన

ప్రజాశక్తి - బొబ్బిలిరూరల్‌ : మహిళలు స్వశక్తితో ఎదగాలని ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంటకచినప్పలనాయుడు అన్నారు. గురువారం స్థానిక మహిళా సమాఖ్య భవనంలో రెండవ ఫ్యాషన్‌ టెక్నాలజీలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్‌లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికీ స్వయం ఉపాధి కల్పన పథకాలు అందజేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా సియెస్‌ఆర్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిక్షణలో మహిళలంతా ఎవరిపై ఆధార పడకుండా తమ కాళ్ళపై తాము నిలబడి ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శంబంగి లక్ష్మీ, వైసిపి మండల అధ్యక్షులు శంబంగి వేణు గోపాల నాయుడు, డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ్‌ చక్రవర్తి, జెడియం మార్టిన్‌, ఏరియా కోఆర్డీనేటర్‌ జె.లక్ష్మనాయుడు, ఎపియం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
కుట్టు శిక్షణతో మహిళలు ఆర్థికంగా బలపడాలి
గజపతినగరం: కుట్టు శిక్షణతో మహిళలు ఆర్థికంగా బలపడాలని భారత డైనమిక్‌ లిమిటెడ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీనివాసులు, హెచ్‌ఆర్‌ ఎన్‌.సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో కుట్టు శిక్షణ తీసుకున్న 60 మంది మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు శిక్షణ పొందిన మహిళల అభిప్రాయాలను అడుగగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు కాలానుగుణంగా అవసరమైన కుట్టడాలను ఈ శిక్షణలో నేర్చుకున్నామని, శిక్షణ అనంతరం డిఆర్‌డిఎ ద్వారా రుణం తీసుకుని కుట్టు మిషన్‌ దుకాణం ఏర్పాటు చేసుకొని వర్క్‌ ఆర్డర్లు తీసుకుని జీవనం సాగిస్తున్నామని చెప్పారు. ప్రొడక్షన్‌ సెంటర్‌ మంజూరు చేయవలసిందిగా కోరారు. వారి అభిప్రాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్దపెద్ద సంస్థల నుండి ఆర్డర్లు తెచ్చుకునే విధంగా ఎదగాలని అన్నారు. డిఆర్‌డిఎ పీడీ ఎ.కళ్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా కుట్టుమిషన్‌లకు అవసరమైన రాయితీ రుణాలను తీసుకొని గ్రూపులుగా కానీ వ్యక్తిగతంగా కానీ పెట్టుకోవాలన్నారు. జిల్లాలో రెండు బ్యాచ్‌ల కింద 600 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. అనంతరం అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్‌ ప్రతినిధి రమేష్‌, జేడీఎం మార్టిన్‌ లూథర్‌, ఏరియా కోఆర్డినేటర్‌ జె.లక్ష్మణ్‌నాయుడు, ఎపిఎంలు యు.జగదీష్‌, ఇందిరా ప్రియ, ఎన్‌.సత్యవతి, మాస్టర్‌ ట్రైనర్స్‌ కర్రీ గౌరీ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక నిర్వహణపై శిక్షణ
వేపాడ: వైఎస్‌ఆర్‌ కాంతిపథం కార్యాలయంలో గురువారం స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా కోఆర్డినేటర్‌ ఎన్‌. ఆదయ్య మాట్లాడుతూ గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరమన్నారు. ఆర్థిక లావాదేవిలలో ఎటువంటి అవకతవకలూ జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు అంతర్గత ఆడిట్‌ నిర్వహించుకోవాలన్నారు. సంఘాలు ద్వారా రుణాలు తీసుకొని క్రమం తప్పకుండా చెల్లించి సంఘ సభ్యులు జీవన విధానాన్ని మెరుగుపర్చుకొని కుటుంబ ఆర్థిక వ్యవస్థలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అన్ని గ్రామ సంఘాల సహాయకులు, గ్రామ సంఘం ఆద్యుక్షలు, ఎపిఎమ్‌ఆర్‌ శ్రీనివాసరావు, సీసీలు కృష్ణ, సత్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.